Share News

Sabarimala Temple: శబరిమలకు వెళ్లలేని స్వాములు.. ఇక్కడ కూడా మాల విరమణ చేయొచ్చు..

ABN , Publish Date - Dec 05 , 2025 | 06:08 PM

ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం కొన్ని వేల మంది అయ్యప్ప భక్తులు.. స్వామి మాల ధరించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఒక్కసారి మాలధారణ చేసిన స్వాములు.. 41 రోజుల పాటు కఠినమైన దీక్షను పాటిస్తుంటారు. బ్రహ్మచర్యం పాటించడంతో పాటూ..

Sabarimala Temple: శబరిమలకు వెళ్లలేని స్వాములు.. ఇక్కడ కూడా మాల విరమణ చేయొచ్చు..

స్వామియే శరణం అయ్యప్ప.. ప్రస్తుతం ఏ ఆలయంలో చూసినా అయ్యప్ప శరణుఘోష వినిపిస్తోంది. అయ్యప్ప మాలధారుల పూజలు, శబరిమల యాత్రలతో నవంబర్ నుంచి జనవరి వరకూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. మాలధారణ చేసిన స్వాములంతా విధిగా శబరిమలకు వెళ్లడం ఆనవాయితీ. శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న అనంతరం మాల విరమణ చేస్తుంటారు. అయితే కొందరు వివిధ కారణాల వల్ల శబరిమలకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వారి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ప్రాంతంలోని చాలా ఆలయాల్లో మాల విరమణ చేయొచ్చని చెబుతున్నారు. ఆ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం కొన్ని వేల మంది అయ్యప్ప భక్తులు.. స్వామి మాల ధరించి, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఒక్కసారి మాలధారణ చేసిన స్వాములు.. 41 రోజుల పాటు కఠినమైన దీక్షను పాటిస్తుంటారు. బ్రహ్మచర్యం పాటించడంతో పాటూ అన్ని నియమాలను పాటిస్తూ నిరంతరం స్వామి ధ్యానంలో ఉంటారు. చివరగా శబరిమలకు చేరుకుని స్వామి దర్శించుంటారు. అనంతరం మాల విరమణ చేసి సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే కొందరు స్వాములు.. వివిధ కారణాల వల్ల శబరిమలకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వారి కోసం ఏపీ, తెలంగాణలో కొన్ని ఆలయాలు అందుబాటులో ఉన్నాయి.


Mallapuram-Ayyappa-Swamy-Te.jpg

మల్లాపురం అయ్యప్ప స్వామి ఆలయం..

కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని మల్లాపురం అయ్యప్ప స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అన్నవరం నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో కన్నెమూల గణపతి, మాళీగైపురతమ్మ ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉభయగోదావరి జిల్లా చుట్టుపక్కల స్వాములకు ఈ ఆలయం సౌకర్యంగా ఉంటుంది.


Bollaram-Ayyappa-Temple.jpg

బొల్లారం అయ్యప్ప ఆలయం..

తెలంగాణలోని సికింద్రాబాద్‌కు సమీపంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. అత్యంత పురాతనమైన ఆయ్యప్ప ఆలయాల్లో ఇది కూడా ఒకటి. 1975లోఈ ఆయాలన్ని నిర్మించారు. ఇక్కడ కేరళలోని పూజా సాంప్రదాయాలనే పాటిస్తుంటారు. శబరిమల ఆలయ ప్రధాన పూజారి ఆధ్వర్యంలో ఆ ఆలయన నిర్వహణ కొనసాగుతోంది. అయ్యప్ప మాలధారులు చాలా మంది ఈ ఆలయంలో మాలవిరమణ చేస్తుంటారు.


Dwarapudi-Ayyappa-Temple.jpg

ద్వారపూడి అయ్యప్ప ఆలయం..

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని ద్వారపూడి అయ్యప్ప ఆలయం కూడా మాల విరమణకు సౌకర్యంగా ఉంటుంది. రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. 1989లో కంచి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ఈ ఆలయాన్ని ప్రతిష్టించారు. శని దోష నివారణకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 వరకూ ఆలయంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తుంటారు.


ayyappa.jpg

శంషాబాద్ అయ్యప్ప ఆలయం..

ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉన్న శంషాబాద్ అయ్యప్ప ఆలయం కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మైలవరం నియోజకవర్గంలో ఈ ఆలయం ఉంటుంది. విజయవాడ నుంచి ఈ ఆలయానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఆలయం పూర్తిగా శబరిమల ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ ఇరుముడి సమర్పణ, పడిమెట్లు, మకరజ్యోతి దర్శనం ప్రత్యేకమని చెప్పొచ్చు. కృష్ణా జిల్లాతో పాటూ చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన అయ్యప్ప మాలధారులు ఈ ఆలయానికి అధిక సంఖ్యలో వస్తుంటారు.


Ayyappa-devotees.jpg

నందిగామ అయ్యప్ప ఆలయం..

తెలంగాణలోని హైదరాబాద్‌కు సమీపంలోని నందిగామ ఆలయం కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఆలయం నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని గురు బ్రహ్మ సతీసన్ నాయర్ గురుస్వామి నిర్మించారు. తెలంగాణలో కేరళ శైలిలో నిర్మించిన అతిపెద్ద ఆలయం ఇదే. ప్రతి ఏడాడీ నవంబర్ 16,17 తేదీల్లో ఈ ఆలయంలో మండల పూజలు ప్రారంభమవుతుంటాయి.


Aryankavu-Shasta-Temple.jpg

ఆర్యంకావు శాస్తా ఆలయం..

కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని ఆర్యంకావు శాస్తా ఆలయానికి కూడా ఎంతో పేరుంది. ఈ ఆలయం పత్తనంతిట్ట జిల్లాలో ఉన్నప్పటికీ ఏపీకి సమీపంలో.. తమిళనాడు సరిహద్దు తిరునల్వేలి జిల్లా సమీపంలో ఉంటుంది. కేరళలోని 5 అయ్యప్ప ప్రధాన ఆలయాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ కూడా చాలా మంది స్వాములు మాల విరమణ చేస్తుంటారు. ఆ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని పరుశురాముడు ప్రతిష్టించాడని స్థలపురాణం చెబుతోంది.


swamy.jpg

సనత్‌నగర్ అయ్యప్ప ఆలయం..

తెలంగాణ హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో ఉన్న అయ్యప్ప ఆలయం చాలా మందికి తెలిసిందే. ఆ ఆలయం కూడా మాల విరమణకు ఎంతో పేరుగాంచింది. అయ్యప్ప భక్త సంఘాల ఆధ్వర్యంలో 1970 సంవత్సరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయ్యప్ప మాల ధారణ చేసే చాలా మంది పోలీసులు.. ఆ ఆలయంలోనే మాలవిరమణ చేస్తుంటారు.


పైన సూచించిన ఆలయాలతో పాటూ ఏపీ, తెలంగాణలో ఇంకా చాలా అయ్యప్ప ఆలయాల్లో స్వాములు మాలవిరమణ చేస్తుంటారు. శబరిమలకు వెళ్లలేని స్వాములు వారికి సమీపంలో ఉన్న ఆలయాల్లో.. గురుస్వాములు, ఆధ్యాత్మికవేత్తలు సలహాలు, సూచనలు తీసుకుని మాల విరమణ చేస్తుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జాక్‌పాట్ కొట్టనున్న ఈ రాశులు.. పట్టిందల్లా బంగారమే..!

ఈ రాశులకు రాజయోగం..

For More Devotional News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 06:08 PM