Share News

UP Thief Caught Sleeping: దొంగతనానికి వెళ్లి.. కుంభకర్ణుడిలా అదే ఇంట్లో నిద్రపోయి.. చివరకు..

ABN , Publish Date - Aug 04 , 2025 | 05:29 PM

ఎవరికీ చిక్కకుండా దొంగతనం చేయాలని దొంగలు పెద్ద పెద్ద ప్లాన్లే వేస్తుంటారు. పని పూర్తయిన వెంటనే కాజేసిన సొమ్ముతో గుట్టు చప్పుడు కాకుండా పారిపోతారు. కానీ, మద్యం మత్తులో మధ్యప్రదేశ్‌లో ఓ దొంగ మాత్రం దొంగతనానికి వెళ్లి ఎంచక్కా నిద్రపోయాడు. కట్ చేస్తే.. చివరకు కటకటాలపాలయ్యాడు.

UP Thief Caught Sleeping: దొంగతనానికి వెళ్లి.. కుంభకర్ణుడిలా అదే ఇంట్లో నిద్రపోయి.. చివరకు..
UP Thief Caught Sleeping

మధ్యప్రదేశ్‌, నజీరాబాద్: ఒక దొంగ చేసిన పని ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా దొంగలు తన పని పూర్తిచేసుకున్న వెంటనే అక్కడినుంచి పారిపోతుంటారు. కానీ మద్యానికి బానిసైన ఓ దొంగ మాత్రం దొంగతనానికి వెళ్లిన అదే ఇంట్లోనే నిద్రపోయాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయి జైలుపాలయ్యాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని నజీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళ్తే, మర్యంపూర్ రైల్వే లైన్‌ వద్ద నివసిస్తున్న ఇద్దరు అన్నదమ్ముల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నాడు ఓ దొంగ. ఫూటుగా మద్యం తాగి అర్ధరాత్రి సమయంలో దొంగతనానికి వెళ్లాడు. ముందు వినోద్ కుమార్ అనే వ్యక్తి ఇంటి కిటికీ పగలగొట్టి లోపలికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న లాకర్ నుంచి విలువైన వస్తువులను దోచుకున్నాడు. ఆ తర్వాత రెండిళ్ల మధ్య తలుపును బద్దలుకొట్టి అనిల్ కుమార్ ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను అపహరించాడు.


అయితే మద్యం మత్తులో ఉండటంతో దొంగకు విపరీతమైన అలసట వచ్చింది. దీంతో, దొంగతనం చేసిన తర్వాత బయటకు పారిపోకుండా అక్కడే పడుకుని నిద్రించాడు. ఉదయం ఇంటికి తిరిగొచ్చిన అనిల్ తెలియని వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యాడు. ఇంటి మొత్తాన్ని పరిశీలించగా విలువైన వస్తువులు మాయమైనట్టు తెలిసింది. నిద్రలో ఉన్న దొంగ వద్ద తమ ఇంట్లోని విలువైన వస్తువులు ఉండటం కనిపించింది.


అనిల్ దొంగ.. దొంగ.. అంటూ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల నివసించే స్థానికులంతా అతడి ఇంటి ముందు పోగయ్యారు. ముందుగా దొంగను పట్టుకుని బాగా దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు దొంగపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి..

శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రపతితో మోదీ, అమిత్‌షా సమావేశం వెనుక కారణం ఇదేనట

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 06:37 PM