JK Statehood: రాష్ట్రపతితో మోదీ, అమిత్‌షా సమావేశం వెనుక కారణం ఇదేనట
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:44 PM
అమిత్‌షా తన కసరత్తులో భాగంగా పలువురు బీజేపీ నేతలు, అప్పటి జమ్మూకశ్మీర్ రాష్ట్ర బీజేపీ చీఫ్‌లతో సమావేశమైనట్టు కూడా చెబుతున్నారు. ప్రధానమంత్రి మోదీ సైతం మంగళవారంనాడు ఎన్డీయే ఎంపీలతో కీలక సమావేశం జరుపనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించనున్నారనే (statehood restoration) ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారంనాడు ఒకరి తరువాత మరొకరు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)తో సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ధ్రువీకరించింది. అయితే ఈ సమావేశాల వెనుక కారణం ఏమిటనేది మాత్రం స్పష్టం చేయలేదు.
అమిత్‌షా తన కసరత్తులో భాగంగా పలువురు బీజేపీ నేతలు, అప్పటి జమ్మూకశ్మీర్ రాష్ట్ర బీజేపీ చీఫ్‌లతో సమావేశమైనట్టు కూడా చెబుతున్నారు. ప్రధానమంత్రి మోదీ సైతం మంగళవారంనాడు ఎన్డీయే ఎంపీలతో కీలక సమావేశం జరుపనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆగస్టు 5న 370వ అధికరణ రద్దు యానివర్శిరీ కావడంతో ఆరోజు కీలక ప్రకటన ఏదో ఉండవచ్చని, ముందస్తు కసరత్తులో భాగంగానే కీలక సమావేశాలు జరుగుతున్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
కాగా, ఈనెల మొదటి రెండు రోజుల్లో జమ్మూకశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్ సత్ పాల్ శర్మ, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తాలతో అమిత్‌షా సమావేశమయ్యారు. ఆల్ జమ్మూ అండ్ కశ్మీర్ షియా అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్రాన్ రజా అన్సారి సైతం సోమవారంనాడు అమిత్‌షాతో సమావేశమయ్యారు.
ఢిల్లీలో వరుస సమావేశాల నేపథ్యంలో ఆగస్టు 5న కీలక ప్రకటన వెలువడే అవకాశాలపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. దీనిపై రిటైర్డ్ ఆర్మీ అధికారి, రచయిత కన్వల్ జీత్ సింగ్ థిల్లాన్ మాట్లాడుతూ, కశ్మీర్‌లో శాంతి కోసం ఎన్నో విలువైన ప్రాణాలను కోల్పోయామని, ఆ కారణంగా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని అన్నారు. శాంతి పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతున్నందున్న పరిస్థితి మొత్తం సానుకూలమయ్యేంత వరకూ వేచిచూడాలని, హడావిడి నిర్ణయం మంచిది కాదని చెప్పారు. రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారనే బలమైన ఊహాగానాలు వస్తున్న విషయం నిజమేనని జియోపొలిటికల్ విశ్లేషకులు ఆర్తి టికూ సింగ్ అన్నారు. అయితే మరో విచిత్రమైన వాదన కూడా వినిపిస్తోందని, కశ్మీర్, జమ్మూను వేరు చేసి రెండు వేర్వేరు రాష్ట్రాలుగా గుర్తిస్తారనే ప్రచారం ఒకటి ఉందని, అదే జరిగితే ఇంతకంటే వినాశకర పరిణామం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి