Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ కోణంలో చూడటం తప్పు: మోహన్ భాగవత్
ABN , Publish Date - Dec 21 , 2025 | 02:53 PM
సంఘ్‌కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని మోహన్ భాగవత్ స్పష్టత ఇచ్చారు. తమకు దేశమే తొలి ప్రాధాన్యమని, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంఘ్ సేవకులు పనిచేస్తుంటారని వివరించారు.
కోల్‌కతా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్‌ను తరచు రాజకీయ కోణంలో పోల్చి చూడటం వల్ల అపార్థాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సావాల్లో భాగంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్‌ను కేవలం మరో సేవా సంస్థగా చూడటం కూడా పొరపాటేనని అన్నారు. ఆర్ఎస్ఎస్‌ను బీజేపీతో పోల్చడం, రాజకీయ కోణంలో చూడటం పెద్ద పొరపాటని భాగవత్ స్పష్టం చేశారు. నైతక విలువలు, సామాజిక బాధ్యత కలిగిన సంఘ్ సేవకులను సృష్టించడం ద్వారా ఆరోగ్యమైన సమాజం, బలమైన దేశాన్ని నిర్మించేందుకు ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.
సంఘ్‌కు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని మోహన్ భాగవత్ స్పష్టత ఇచ్చారు. తమకు దేశమే తొలి ప్రాధాన్యమని, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సంఘ్ సేవకులు పనిచేస్తుంటారని వివరించారు. సంఘ్ కృషితో భారత్ మళ్లీ విశ్వగురువుగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ఎస్ నైతిక విలువలు కలిగిన స్వయం సేవకులను తయారు చేస్తుందని, అలాంటి వ్యక్తుల నిస్వార్థ సేవలు, విలువలతో కూడిన జీవితమే దేశ పటిష్టత, అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తుందని చెప్పారు. భారతదేశ సనాతన సంస్కృతీ విలువలకు కట్టుబడి ఉండటం, స్వదేశీని ప్రోత్సహించడం వంటివి జాతి నిర్మాణం, జాతి భద్రతకు అనివార్యమని అన్నారు.
సంఘ్ లాంటి మరో ఆర్గనైజేషన్ లేదని, పోలికలతో సంఘ్‌ను అర్థం చేసుకోవాలంటే అది ఆపార్ధాలకే దారితీస్తుందని చెప్పారు. స్వయం సేవకుల్లో వివిధ రంగాలకు చెందినవారున్నారని, కొందరు రాజకీయాల్లోనూ, కొందరు అధికారంలోనూ ఉన్నారని చెప్పారు. ఆకారణంగానే చాలామంది బీజేపీ కోణంలోంచి సంఘ్‌ను చూస్తుంటారని, అయితే అది పొరపాటని వివరించారు. సంఘ్‌ను అర్థం చేసుకోవాలంటే సంఘ్ గురించి తెలుసుకుని, నేరుగా అవగాహన చేసుకుని, ఆ అనుభూతిని పొందినప్పుడే తెలుస్తుందన్నారు. కేవలం బయట నుంచి చూసి అవగాహన చేసుకోవడం కుదరదని, ఎందుకంటే ఎవరి దృష్టికోణం వారికి ఉంటుందని అన్నారు. పేదల అభ్యున్నత, హిందూ సమాజ పరిరక్షణకు సంఘ్ పనిచేస్తోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. టికెట్ ధరలు పెంపు.. ఎప్పటి నుంచంటే..
దట్టమైన పొగమంచు ఆవరించిన ఆగ్రా.. తాజ్‌మహల్ అస్పష్టం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి