FSSAI Statement On Eggs: వెరీ'గుడ్డు'.. అపోహలకు నో ఛాన్స్: ఎఫ్ఎస్ఎస్ఏఐ
ABN , Publish Date - Dec 21 , 2025 | 07:16 AM
దేశంలో ఉత్పత్తి అవుతున్న గుడ్లు సురక్షితమైనవేనని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ పేర్కొంది. వాటివల్ల మానవ ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలూ రావని వివరిస్తూ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: కోడిగుడ్లు(Eggs) మానవ వినియోగానికి సురక్షితమైనవనీ.. వాటి నుంచి క్యాన్సర్ ముప్పేమీ లేదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(FSSAI) స్పష్టం చేసింది. గుడ్డు తినడం ద్వారా క్యాన్సర్(Cancer) వచ్చే ప్రమాదముందని ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతుండటంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పందించింది. అవన్నీ ప్రజల్లో భయాందోళన కలిగించే వదంతులే తప్ప.. వాటికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో ప్రస్తుతం లభ్యమవుతోన్న కోడిగుడ్లు సురక్షితమైనవేనని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. గుడ్లలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని, అవి క్యాన్సర్‌కు దారి తీస్తాయని చెప్పేందుకు శాస్త్రీయంగా ఎలాంటి రుజువులూ లేవని పేర్కొంది. అయితే.. దేశంలో ఉత్పత్తవుతోన్న గుడ్లలో క్యాన్సర్ కారక నైట్రోఫురాన్ మెటబోలైట్స్(Nitrofuran Metabolites) ఉన్నాయంటూ ఇటీవలి కాలంలో మీడియా, సామాజిక మాధ్యమాల్లో వరుసగా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇచ్చింది.
ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలు-2011 ప్రకారం.. పౌల్ట్రీ, గుడ్ల ఉత్పత్తి జరిగే అన్ని దశల్లోనూ నైట్రోఫ్యూరాన్(Nitrofuran)ల ఉపయోగాన్ని పూర్తిగా నిషేధించామంది ఎఫ్ఎస్ఎస్ఏఐ. అనుమతించిన దానికంటే తక్కువ స్థాయిలో అలాంటి అవశేషాలేవైనా బయటపడినా అవి ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన కిందకు రావని, దానివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశం లేదని స్పష్టం చేసింది. భారత్‌లో నియంత్రణ ప్రమాణాలు అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా ఉన్నాయని కూడా వెల్లడించింది. ఎక్కడో కొన్ని ప్రయోగశాలల్లో వెలువడిన ఫలితాల ఆధారంగా.. గుడ్లు సురక్షితం కాదని ముద్ర వేయడం శాస్త్రీయబద్ధంగా సరికాదని తేల్చిచెప్పింది.
ఇవీ చదవండి:
ఉపాధి హామీ పథకంపై బుల్డోజర్.. సోనియాగాంధీ ఫైర్
మేమిద్దరం వెళ్తాం.. ఢిల్లీ పర్యటనపై డీకే