Share News

DK Shivakumar: మేమిద్దరం వెళ్తాం.. ఢిల్లీ పర్యటనపై డీకే

ABN , Publish Date - Dec 20 , 2025 | 03:59 PM

పార్టీ అధిష్ఠానాన్ని కలిసేందుకు ఇద్దరు నేతలు వెళ్లే అవకాశం ఉందా అని అడిగినప్పుడు డీకే శివకుమార్ నవ్వుతూ సమాధానమిచ్చారు. మీడియాకు తప్పనిసరిగా చెబుతానని, ఏదీ దాచిపెట్టనని అన్నారు.

DK Shivakumar: మేమిద్దరం వెళ్తాం.. ఢిల్లీ పర్యటనపై డీకే
DK Shivakumar with Siddaramaiah

బెంగళూరు: అధికార మార్పిడి అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య అంతరం పెరుగుతోందంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ (DK Shivakumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చర్చల కోసం ఎప్పుడు పిలిచేది కాంగ్రెస్ అధిష్ఠానం తమ ఇద్దరికీ చెప్పిందని అన్నారు. అధిష్ఠానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇద్దరూ వెళ్తామని తెలిపారు.


పార్టీ అధిష్ఠానాన్ని కలిసేందుకు ఇద్దరు నేతలు వెళ్లే అవకాశం ఉందా అని అడిగినప్పుడు డీకే నవ్వుతూ సమాధానమిచ్చారు. మీడియాకు తప్పనిసరిగా చెబుతానని, ఏదీ దాచిపెట్టనని అన్నారు. సరైన సమయంలో ఢిల్లీకి పిలుస్తామని అధిష్ఠానం పెద్దలు తమ ఇద్దరికి ఫోన్ చేసి చెప్పారని, పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు ఇద్దరూ వెళ్తామని తెలిపారు. ముఖ్యమంత్రి పదవిలో తాను కొనసాగుతానని అసెంబ్లీలో సిద్ధరామయ్య తాజాగా ప్రకటించిన నేపథ్యంలో డీకే ఈ వ్యాఖ్యలు చేశారు.


ఉత్తర కర్ణాటక అభివృద్ధి పనుల అంశంపై సిద్ధరామయ్య శుక్రవారంనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ, తన పదవీకాలం రెండున్నరేళ్లకే పరిమితమని తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. అధిష్ఠానం తనను ఐదేళ్లూ పదవిలో కొనసాగిస్తుందని అనుకుంటున్నట్టు చెప్పారు. 'మీ హయాంలో నార్త్ కర్ణాటకకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయా?' అని బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అడిగిన ప్రశ్నకు స్పందనగా సీఎం ఈ సమాధానం ఇచ్చారు. అధిష్ఠానం తన వైపే ఉందని అనుకుంటున్నానని, అయితే పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.


కాగా, పలువురు నాగసాధువులు శనివారంనాడు డీకే నివాసానికి వచ్చి ఆశీస్సులు ఇచ్చారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా కూడా ఉన్న డీకే మంగళవారంనాడు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. నదుల అనుసంధానం విషయంలో కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ తమను పిలిచినట్టు డీకే తెలిపారు. మహదయి, కృష్ణ వాటర్ అవార్డ్, మేకేదాటు, ఎగువ భద్ర ప్రాజెక్టులకు సంబంధించి చర్చించనున్నట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

టీఎంసీ సంరక్షణలో చొరబాటుదారులు.... విరుచుకుపడిన మోదీ..

సంప్రదాయ వైద్య విధానాలపై విశ్వాసం అలా పెరుగుతుంది: ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 20 , 2025 | 04:01 PM