Share News

PM Modi-Traditional Medicine: సంప్రదాయ వైద్య విధానాలపై విశ్వాసం అలా పెరుగుతుంది: ప్రధాని మోదీ

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:55 PM

సైన్స్ ఆధారంగా సంప్రదాయ వైద్య విధానాలు సమాజంలో విశ్వాసం, విస్తృతిని పెంపొందించాలని ప్రధాని మోదీ సూచించారు. డబ్ల్యూహెచ్ఓ సమావేశాల్లో ప్రధాని ఈ కామెంట్స్ చేశారు.

PM Modi-Traditional Medicine: సంప్రదాయ వైద్య విధానాలపై విశ్వాసం అలా పెరుగుతుంది: ప్రధాని మోదీ
PM Modi On Traditional Medicine Reach

ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో సంప్రదాయ వైద్య విధానాల విస్తృతి ఆశించిన మేరకు లేదని ప్రధాని మోదీ అన్నారు. సైన్స్ ద్వారా వీటిపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని వ్యాఖ్యానించారు. తద్వారా వీటి విస్తృతి పెరుగుతుందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో సంప్రదాయ వైద్య విధానాలపై ఢిల్లీలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో శుక్రవారం ప్రధాని ఈ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ వైద్య విధానాలపైనే ఆధారపడుతూ వస్తున్నారని చెప్పారు. అయినా కానీ ఆశించిన మేర వీటి విస్తృతి లేదని చెప్పారు. ఈ వైద్య విధానాలు కేవలం జీవనశైలికి మాత్రమే సంబంధించినవి అన్న భావన ఉన్నప్పటికీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని చెప్పారు. అత్యవసర సందర్భాల్లో కూడా సంప్రదాయ వైద్య విధానాలు కీలక పాత్ర పోషించగలవని అన్నారు. సైన్స్ ఆధారంగా వీటి విస్తృతిని పెంచాలని సూచించారు.


ఈ దిశగా భారత్ తీసుకుంటున్న చర్యల గురించి కూడా ప్రధాని పేర్కొన్నారు. వందల సంవత్సరాలుగా భారత్‌లో అశ్వగంధ మూలిక వినియోగంలో ఉందని చెప్పారు. అయితే, కొవిడ్ సంక్షోభం తరువాత దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని అన్నారు. పరిశోధన, సరైన ఆధారాలతో అశ్వగంధ ప్రభావాన్ని నిరూపిస్తూ భారత్ ముందుకెళుతోందని అన్నారు. అంతర్జాతీయంగా కూడా అనేక మంది నిపుణులు ఈ మూలిక ప్రభావశీలతపై చర్చించారని చెప్పారు.

సంప్రదాయ వైద్య విధానాల విస్తృతి పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రయత్నించాలని ప్రధాని మోదీ సూచించారు. యోగా శిక్షణపై డబ్ల్యూహెచ్ఓ రూపొందించిన టెక్నికల్ రిపోర్టును కూడా ప్రధాని రిలీజ్ చేశారు. ఈ సమావేశాల్లో ప్రధానితో పాటు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అథానమ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ప్రతాప్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్‌ దాడి చేశాడు.. ప్రయాణికుడి సంచలన ఆరోపణ

ప్రాణం తీసిన అపార్టుమెంట్‌ వివాదం..

Updated Date - Dec 20 , 2025 | 01:12 PM