AIX Pilot Attack: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ దాడి చేశాడు.. ప్రయాణికుడి సంచలన ఆరోపణ
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:01 AM
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ తనపై దాడి చేశాడంటూ ఓ ప్రయాణికుడు ఆరోపించారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సదరు పైలట్‌ను విధులకు దూరంగా పెట్టినట్టు వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ తనపై దాడి చేశాడంటూ ఓ స్పైస్ జెట్ ప్రయాణికుడు చేసిన ఆరోపణ ప్రస్తుతం సంచలనంగా మారింది. తన దుస్తులపై రక్తం మరకలు ఉన్న ఫొటోను కూడా బాధితుడు అంకిత్ దివాన్ నెట్టింట షేర్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది.
క్యూలైన్‌ను దాటి ముందుకెళ్లిన పైలట్‌ను ప్రశ్నిస్తే దాడి చేశాడని అంకిత్ పేర్కొన్నారు. తాము స్ట్రోలర్‌లో చిన్న పాపను తీసుకుని రావడంతో సిబ్బంది తమను స్టాఫ్‌కు ఉద్దేశించిన సెక్యూరిటీ చెకిన్ లైన్‌లో వెళ్లమన్నారని ఆయన తెలిపారు. క్యూలైన్‌ను అనుసరించకుండా ముందుకు వెళుతున్న పైలట్ వీరేందర్ సేజల్‌ను అడ్డుకోవడంతో వివాదం మొదలైందని తెలిపారు. ‘సిబ్బంది కోసం ఉన్న లైన్‌లో వస్తున్నావు.. నిరాక్షరాస్యుడివా?’ అంటూ తనపై పైలట్ మండిపడ్డారని ఆరోపించారు. ఆ తరువాత తనపై దాడి చేశారని పేర్కొన్నారు. తన భార్య, కూతురి ముందే ఈ దాడి జరగడంతో వారు షాక్‌కు గురయ్యారని అన్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని పైలట్‌ను బెంగళూరుకు పంపించారు. అప్పటికే ఈ వివాదం గురించి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చేరడంతో అతడిని విమానం నడిపేందుకు అనుమతించలేదు.
‘ఇలాంటి పైలట్‌లను డీజీసీఏ, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎలా అనుమతిస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. చిన్న ఘర్షణలకే ఇలా ఉద్రేకపడే వారు ప్రయాణాలప్పుడు వందల కొద్దీ ప్యాసెంజర్‌లకు ఎలా బాధ్యత వహించగలరు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు మేనేజమెంట్ ఇలాంటి నిర్వహణ లోపాలను ఎలా చూస్తూ ఊరుకుంటోంది’ అని ప్రశ్నించారు.
ఈ విషయంపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోనని హామీ ఇస్తూ తాను లేఖ కూడా రాయాల్సి వచ్చిందని అన్నారు. ‘లేటర్ రాయకపోతే ఫ్లైట్ మిస్ అయ్యి ఉండేవాడిని. 1.2 లక్షల హాలిడే బుక్సింగ్స్ అన్ని వృథా అయ్యి ఉండేవి. మళ్లీ తిరిగొచ్చాక నేను ఎందుకు ఫిర్యాదు దాఖలు చేయకూడదు’ అని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా అదృశ్యం కావచ్చేమో అని అనుమానం వ్యక్తం చేశారు.
ఇక ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎక్స్ వేదికగా స్పందించింది. ఘటనను ఖండిస్తున్నామని తెలిపింది. దర్యాప్తు ప్రారంభించామని పేర్కొంది. పైలట్‌ను విధులకు దూరంగా పెట్టామని కూడా చెప్పింది.
ఇవి కూడా చదవండి
ప్రాణం తీసిన అపార్టుమెంట్ వివాదం..
ఇకపై అన్ని స్కూళ్లల్లో ‘ముస్తాబు’.. సర్కార్ ఉత్తర్వులు జారీ