Share News

Sonia Gandhi: ఉపాధి హామీ పథకంపై బుల్డోజర్.. సోనియాగాంధీ ఫైర్

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:23 PM

మహాత్మాగాంధీ పేరును ఉద్దేశపూర్వకంగానే కేంద్రం తొలగించిందని, ఉపాథి హామీ పథకం రూపురేఖలను కుట్రపూరితకంగా మార్చేసిందని సోనియాగాంధీ తప్పుపట్టారు.

Sonia Gandhi: ఉపాధి హామీ పథకంపై బుల్డోజర్.. సోనియాగాంధీ ఫైర్
Sonia Gandhi

న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరు మార్పుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఉపాథి హామీ పథకంపై బుల్జోజర్ నడిపారని ఆరోపించారు. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ స్థానే కేంద్రం తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ జీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ-జి రామ్ జి)బిల్లుకు ఇటీవల పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించింది.


దీనిపై సోనియాగాంధీ తొలిసారి స్పందించారు. మహాత్మాగాంధీ పేరును ఉద్దేశపూర్వకంగానే కేంద్రం తొలగించిందని, ఉపాథి హామీ పథకం రూపురేఖలను కుట్రపూరితకంగా మార్చేసిందని తప్పుపట్టారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా, భాగస్వాములతో సంప్రదింపులు జరపకుండా, విపక్షాలను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఈ మార్పులు తీసుకువచ్చిందని అన్నారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు.


'20 ఏళ్ల క్రితం మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఎంజీఎన్ఆర్‌ఈజీఏను పార్లమెంటులో ఏకాభిప్రాయంతో ఆమోదించాం. ఈ పథకంతో పేదల ఉపాధికి చట్టపరమైన హక్కు కలిగింది. తద్వారా గ్రామీణ పంచాయతీలు బలపడడానికి దోహదపడింది. ఎంజీఎన్ఆర్‌ఈజీఏతో మహాత్మాగాంధీ కలస సాకారానికి పటిష్టమైన అడుగు వేశాం' అని సోనియాగాంధీ చెప్పారు.


రైతుల ప్రయోజనాలపై మోదీ దాడి

దేశంలోని కోట్లాది మంది రైతులు, కార్మికులు, భూమిల్లేని వారి ప్రయోజనాలపై మోదీ ప్రభుత్వం దాడి జరిపిందని, గత 11 ఏళ్లుగా గ్రామీణ పేదల ప్రయోజనాలను కేంద్రం నిర్లక్ష్యం చేసిందని సోనియాగాంధీ విమర్శించారు. ఎంజీఎన్ఆర్‌ఈజీఏతో ఉపాధి వలసలకు కళ్లెం పడిందని, ఉపాధికి చట్టపరమైన హక్కు లభించిందని, గ్రామ పంచాయతీలు సాధికారత సాధించాయని చెప్పారు. అయితే ఎంజీఎన్ఆర్ఈజీఏపై ప్రభుత్వం ఇటీవల బుల్డోజర్ నడిపిందని, మహాత్మాగాంధీ పేరును తొలగించడమే కాకుండా హామీ పథకం రూపురేఖలనే మార్చేసిందని తప్పుపట్టారు. ఎవరినీ సంప్రదించకుండా, చర్చలు లేకుండా, విపక్షాలను ఖాతరు చేయకుండా కుట్రపూరితంగా ఈ మార్పులు చేసిందని అన్నారు.


నల్లచట్టానికి వ్యతిరేకంగా పోరాటం

ప్రభుత్వం తీసుకువచ్చిన నల్లచట్టానికి వ్యతిరేకంగా పోరాడేందుకు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని సోనియాగాంధీ తెలిపారు. ఎంజీఎన్ఆర్‌ఈజీఏను తేవడం, అమలు చేయడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించదని, అయితే ఇది ఎన్నడూ పార్టీ అంశంగా తీసుకోలేదని, జాతీయ, ప్రజా ప్రయోజనాలతో సంబంధం కలిగిన స్కీమ్‌గానే తాము భావించామని చెప్పారు. ఈ చట్టాన్ని బలహీనపరచడం ద్వారా మోదీ లక్షలాది మంది రైతులు, కార్మికులు, గ్రామీణ రంగంలో భూముల్లేని పేదల ప్రయోజనాలపై దాడి జరిపారని అన్నారు. ఈ దాడిని ప్రతిఘటించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 20 ఏళ్ల క్రితం తాను కూడా పేదప్రజానీకం ఉపాధి హక్కుల కోసం పోరాడానని, ఇవాళ తిరిగి కేంద్రం తెచ్చిన నల్లచట్టానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తనతో పాటు లక్షలాది మంది కార్యకర్తలు ఇందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరిరోజున 'వీబీ-జీ రామ్ జీ' బిల్లును ఉభయసభల్లో ఆమోదించారు. ఆరోజు సాయంత్రం లోక్‌సభ ఆమోదించిన కొన్ని గంటల్లోనే ఎగువసభ అర్థరాత్రి సమయంలో మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా బిల్లుకు ఆమోదం తెలపడంపై విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. మొత్తంగా లోక్‌సభలో 8 గంటల సేపు, రాజ్యసభలో 5 గంటల సేపు చర్చ జరిగింది. జేపీసీ వేయాలన్న డిమాండ్‌ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. మహాత్మాగాంధీని అవమానించి, పని హక్కును అణిచివేసిన ప్రభుత్వ నిరంకుశత్వంపై పోరాడతామని మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

టీఎంసీ సంరక్షణలో చొరబాటుదారులు.... విరుచుకుపడిన మోదీ..

మేమిద్దరం వెళ్తాం.. ఢిల్లీ పర్యటనపై డీకే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 20 , 2025 | 05:25 PM