Indian Railways Fare Hike: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. టికెట్ ధరలు పెంపు.. ఎప్పటి నుంచంటే..
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:57 PM
టికెట్ ధరలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో రైలు ప్రయాణీకులపై ఆర్థిక భారం పడనుంది.
పేద, మధ్య తరగతి ప్రజల పుష్పక విమానం ఏది అంటే రైలు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎక్కువ శాతం మంది ప్రజలు దూర ప్రాంత ప్రయాణానికి రైలు మీదే ఆధారపడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం రైలు ద్వారానే సాధ్యపడుతోంది. అయితే, రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయంతో రైలు ప్రయాణీకులపై ఆర్థిక భారం పడనుంది. టికెట్ ధరలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 26వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
జనరల్ క్లాస్ టికెట్ ధరల్లో 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి మార్పు ఉండదు. 215 కిలోమీటర్లకు మించి ఉంటే ప్రతీ కిలోమీటర్‌పై ఒక పైసా ధర పెరుగుతుంది. నాన్ ఏసీ కోచులకు ప్రతీ కిలోమీటర్‌కు 2 పైసాలు పెరిగింది. ఏసీ కోచుల్లో ప్రయాణంపై కూడా కిలోమీటర్‌కు రెండు పైసాలు పెరిగింది. ఒక వేళ మీరు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇప్పుడున్న టికెట్ రేటుపై 10 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ప్రతీ ఏటా అదనంగా 600 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. అయితే, రైల్వే శాఖ మ్యాన్ పవర్ కోసం ప్రతీ ఏటా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తోంది.
2024 - 2025 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఏకంగా 2,63,000 కోట్లు ఖర్చు చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాన్ పవర్ కాస్ట్ పెరిగిన కారణంగానే కార్గో లోడింగ్‌తో పాటు టికెట్ ధరలు పెంచాలని నిర్ణయం తీసుకుంది. కాగా, రైల్వే శాఖ గత జులై నెలలో టికెట్ ధరలు పెంచింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించి ఏసీ కోచ్‌లలో ప్రయాణానికి కిలో మీటర్‌కు ఒక పైసా చొప్పున పెంచింది. రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణీలపై అదనపు భారం పడనుంది. తరచుగా రైళ్లలో ప్రయాణించే వారికి ఇది ఒకరకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.
ఇవి కూడా చదవండి
డయాబెటిస్ ఉందో లేదో కళ్లే చెబుతాయి.. ఎలా అంటే?
ఈ రాణి చీర వెనక పెద్ద కథే ఉందట మరి.