West Bengal: మమత ఓటమే లక్ష్యంగా కొత్త పార్టీ.. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే హెచ్చరిక
ABN , Publish Date - Dec 07 , 2025 | 05:16 PM
బెల్డాంగలో ప్రతిపాదిత బాబ్రీ మసీదుకు కబీర్ శనివారంనాడు శంకుస్థాపన చేశారు. ఆయన నుంచి బాబ్రీ మసీదు ప్రకటన వెలువడగానే పార్టీ నుంచి కబీర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు టీఎంసీ ప్రకటించింది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన టీఎంసీ సస్పెండెడ్ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ (Humayun Kabir) సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)ని వచ్చేఏడాది ఎన్నికల్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా అధికారంలోకి రాకుండా చేస్తామని హెచ్చరించారు. తృణమూల్ ముస్లిం ఓటు బ్యాంకు ముగిసిపోతుందని అన్నారు. 'పిక్చర్ అభి బాకీ హై' అంటూ కామెంట్స్ చేశారు.
డిసెంబర్ 22న కొత్త పార్టీ
బెల్డాంగలో ప్రతిపాదిత బాబ్రీ మసీదుకు కబీర్ శనివారంనాడు శంకుస్థాపన చేశారు. ఆయన నుంచి బాబ్రీ మసీదు ప్రకటన వెలువడగానే పార్టీ నుంచి కబీర్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు టీఎంసీ ప్రకటించింది. కాగా, డిసెంబర్ 22న కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు కబీర్ తాజాగా ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
వచ్చే ఏడాది జరుగనున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను 135 చోట్ల తమ అభ్యర్థులను నిలబెడతామని కబీర్ తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో తమ పార్టీ 'గేమ్ ఛేంజర్' కానుందని చెప్పారు. ముస్లింల కోసం తమ పార్టీ పనిచేస్తుందని, ఐఏఎంఐఎంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఆ పార్టీతో టచ్‌లో ఉన్నామని తెలిపారు. కాగా, దీనిపై ఏఐఎంఐఎం కానీ, ఒవైసీ కానీ ఇంకా స్పందించలేదు.
బీజేపీని అధికారంలోకి రానీయం
బెంగాల్‌లో బీజేపీని అధికారంలోకి రానీయమని, టీఎంసీ సైతం వచ్చే ఏడాది ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని కబీర్ చెప్పారు. బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మాణంపై మాట్లాడుతూ, దేశంలోని పలు పారిశ్రామిక సంస్థలు తనకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇండియాలోని ముస్లింల వద్ద చాలా నిధులున్నాయని, బాబ్రీ నిర్మాణానికి వారు సాయం అందించనున్నారని చెప్పారు. మసీదు నిర్మాణం మత ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నంగా బీజేపీ విమర్శిస్తుండగా, తాము సెక్యులర్ సిద్ధాంతాలను విశ్వసిస్తామని కబీర్ తెలిపారు. శనివారంనాడు నిర్వహించిన కబీర్ పౌండేషన్ 'బాబ్రీ మసీదు' ఈవెంట్‌కు 8 లక్షల మంది హాజరైనట్టు ఆయన చెప్పారు. ఇటుకలు, నగదు రూపంలో విరాళాలు వెల్లువెత్తుతున్నట్టు వెల్లడించారు.
కాగా, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ టీఎంసీకి ముస్లింలు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో బలంగా వేళ్లూనుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. 2021 ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంత బలీయమైన శక్తిగా బీజేపీ నిలిచింది. అయితే ప్రతికూలతలు ఉన్నప్పటికీ 2021 ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో తృణమూల్ గెలిచింది.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో బాబ్రీ మెమోరియల్.. ప్రకటించిన తెహ్రీక్ ముస్లిం షబ్బన్
సిద్ధూ మళ్లీ రాజకీయాల్లోకి.. అయితే ఒక కండిషన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి