Share News

Navjot Sidhu: సిద్ధూ మళ్లీ రాజకీయాల్లోకి.. అయితే ఒక కండిషన్

ABN , Publish Date - Dec 07 , 2025 | 02:50 PM

పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరును నవజ్యోత్ కౌర్ ప్రస్తావిస్తూ, ఐదుగురు నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నందున వారు సిద్ధూకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Navjot Sidhu: సిద్ధూ మళ్లీ రాజకీయాల్లోకి.. అయితే ఒక కండిషన్
Navjot singh sidhu

న్యూఢిల్లీ: నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన భార్య, కాంగ్రెస్ నేత నవజ్యోత్ కౌర్ సిద్ధూ సంకేతాలు ఇచ్చారు. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే తన భర్త తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని తెలిపారు. సిద్ధూ ప్రస్తుతం జీవనోపాధికి అవసరమైనంత సంపాదించుకుంటున్నారని, అవకాశం ఇస్తే రాష్ట్రానికి సేవలందించేందుకు రాజకీయాల్లోకి తిరిగి వస్తారని చెప్పారు.


పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరును నవజ్యోత్ కౌర్ ప్రస్తావిస్తూ, ఐదుగురు నేతలు ఇప్పటికే ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నందున వారు సిద్ధూకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ నేతలు సిద్ధూను ప్రమోట్ చేస్తారని తాను అనుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం అర్ధం చేసుకుంటే అది వేరే విషయమని అన్నారు.


సిద్ధూను డబ్బు ప్రభావితం చేయలేదని, పార్టీలకు ఇచ్చేందుకు తమ వద్ద డబ్బులు కూడా లేవని, ఇందుకు బదులుగా మంచి ఫలితాలు సాధించి పంజాబ్‌ను గోల్డెన్ స్టే‌ట్‌గా మార్చగలమని కౌర్ ధీమా వ్యక్తం చేశారు. 'ఎవరైనా రూ.500 కోట్ల సూట్‌కేసు ఇస్తే ముఖ్యమంత్రి కావచ్చు. కానీ మా విధానం అది కాదు' అని అన్నారు. యాక్టివ్ పాలిటిక్స్‌కు సిద్ధూ దూరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సిద్ధూకు సన్నిహిత సంబంధాలున్నాయని, కొద్ది నెలలుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, 2024 ఎన్నికల్లోనూ ప్రచారం చేయలేదని చెప్పారు.


కాగా, రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సిద్ధూ తిరిగి ఐపీఎల్ క్రికెట్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తూ, 'నవజ్యోత్ సిద్ధూ అఫీషియల్' అనే యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు. అందులో తన జీవిత అనుభవాలను, క్రికెట్ ఇన్సైట్స్, మోటివేషనల్ టాక్స్, లైఫ్‌స్టైల్ కంటెంట్‌ను అందిస్తున్నారు. ప్రజాసంక్షేమం కోసమే రాజకీయాలని, అది వ్యాపారం కాదని, తన రాజకీయ భవిష్యత్తును కాలానికే వదిలిపెట్టానని సిద్ధూ చెబుతున్నారు. పంజాబ్ అసెంబ్లీ తదుపరి ఎన్నికలు 2027లో జరుగనున్నాయి. కాగా, నవజ్యోత్ కౌర్ తాజా ప్రకటనతో సిద్ధూ తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయనే ఊహాగానాలకు తావిస్తోంది.


ఇవి కూడా చదవండి..

గోవా నైట్ క్లబ్ ప్రమాదం.. వెలుగులోకి భయానక వీడియో..

గోవా అగ్నిప్రమాద ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 07 , 2025 | 04:00 PM