Share News

Nightclub Fire In Goa: గోవా నైట్ క్లబ్ ప్రమాదం.. వెలుగులోకి భయానక వీడియో..

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:59 PM

గోవా బిర్చ్ నైట్ క్లబ్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 25 మంది చనిపోయారు. శనివారం అర్థరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగిందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Nightclub Fire In Goa: గోవా నైట్ క్లబ్ ప్రమాదం.. వెలుగులోకి భయానక వీడియో..
Nightclub Fire In Goa

ప్రముఖ పర్యాటక ప్రదేశం గోవాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం అర్థరాత్రి బిర్చ్‌ నైట్‌ క్లబ్‌లో సిలిండర్‌ పేలింది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 25 మందిలో కొంతమంది మంటల్లో కాలిపోయి చనిపోగా.. మరికొంతమంది పొగ కారణంగా ఊపిరి ఆడక చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. క్లబ్‌లో భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు.


వైరల్‌గా భయానక దృశ్యాల వీడియో..

బిర్చ్‌ నైట్‌ క్లబ్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. నైట్ క్లబ్‌లో ఓ లేడీ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తూ ఉంది. ఆమె వెనకాల కొంతమంది డ్రమ్స్ వాయిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. జనం ఆ ఆట, పాటకు మైమరచిపోయి కేకలు వేస్తూ ఉన్నారు. ఇంతలో వారి వెనకాల పైకప్పు నుంచి మంటలు మొదలయ్యాయి. సెకన్లలో ఆ ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో భయపడిపోయిన డ్యాన్సర్, ఇతర వ్యక్తులు అక్కడినుంచి పరుగులు పెట్టారు. నిప్పు కణికలు పైకప్పు నుంచి కిందకు రాలుతూ ఉన్నాయి.


బాధిత కుటుంబాలకు 2 లక్షలు..

భారత ప్రధాని నరేంద్ర మోదీ గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రధాని ఓ ప్రకటన విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

రెచ్చిపోయిన వైసీపీ నేత.. రూ. 5 కోట్ల భూమి కబ్జా

Updated Date - Dec 07 , 2025 | 01:54 PM