Thieves On Bikes Loot Bags: సినిమా లెవెల్ సీన్.. రన్నింగ్ బస్సులోని బ్యాగ్స్ చోరీ
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:01 PM
నేటికాలంలో అనేక రకాల చోరీలు జరుగుతున్నాయి. అయితే కొన్ని దొంగతనాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ భారీ చోరీ జరిగింది. సినిమా లెవెల్ సీన్ తలపిస్తూ.. కదులుతున్న బస్సు నుంచి లగేజీలను చోరీ చేశారు.
బాలీవుడ్ సినిమా 'ధూమ్' తరహాలో మహారాష్ట్ర(Mharashtra)లో ఓ దొంగతనం జరిగింది. ఓ కేటుగాడు రన్నింగ్‌లో ఉన్న బస్సుపైకి ఎక్కి... వస్తువులను చోరీ చేసి వాటిని వెనుకనే బైక్ పై వస్తున్న తమ గ్యాంగ్ సభ్యులకు అందజేస్తున్నాడు. ఈ చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో షోలాపూర్-ధులే హైవే(highway thefts)పై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన బస్సుకు వెనుక ఉన్న కెమెరాలో రికార్డైంది.
వైరల్ అవుతున్న ఈ ఫుటేజ్‌లో దొంగలలో ఒకరు వేగంగా వెళ్తున్న బస్సుపైకి ఎక్కి.. వెనుక లగేజీ కంపార్ట్‌మెంట్‌ను తెరిచాడు. అనంతరం అందులోని బ్యాగులను ఒక్కొక్కటిగా రోడ్డుపైకి విసిరేశాడు. బస్సును అనుసరిస్తున్న అతడి మిగిలిన సభ్యులు.. కింద పడిన బ్యాగులను తీసుకుంటున్నారు. ఈ ఘటన గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు పెళ్లికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్(travel bus thefts) బస్సును వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలు బస్సు నుంచి పది బ్యాగులను సేకరించి విలువైన వస్తువులతో పారిపోయారు. అయితే చోరీకి గురైన వస్తువుల విలువ ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనను బీడ్ జిల్లా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అంతేకాక ఆ చోరీ జరిగిన హైవే పై పెట్రోలింగ్, గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ నవనీత్ కన్వత్ ఆదేశించారు. నేరస్థులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఇటీవల కాలంలో బీడ్ జిల్లా ప్రాంతంలో ఆగిన లేదా నెమ్మదిగా కదిలే ట్రావెల్ బస్సుల నుండి చోరీల సంఖ్య గణనీయంగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో పోలీసులు కూడా కఠిన చర్యలకు దిగారు. అలానే ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని, వాహనానికి వెలుపల ఉండే లగేజ్ కంపార్ట్‌మెంట్లలో విలువైన వస్తువులను ఉంచవద్దని తెలిపారు. ప్రయాణ సమయంలో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే.. వెంటనే పోలీసులకు సమాచార ఇవ్వాలని తెలిపారు. హైవే వెంబడి ఉన్న హోటల్ నిర్వాహకులు( hotel safety) కూడా వారి CCTV వ్యవస్థలు పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవాలని తెలిపారు. హైవేలపై అనుమానాస్పద కదలికల గుర్తిస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
జిన్నా వ్యతిరేకిస్తే నెహ్రూ సమర్ధించారు.. వందేమాతరంపై చర్చలో మోదీ
వందేమాతర గీతం దేశం ముక్కలు కాకుండా కాపాడింది.. లోక్‌సభలో మోదీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి