Telangana Rising Summit: అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ: సీఎం రేవంత్
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:28 PM
తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2014లో శ్రీమతి సోనియా గాంధీతోపాటు నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 08: తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం ప్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2047కు సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్నదే తమ ఆశయమని ఆయన స్పష్టం చేశారు. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సహకరించిన వారందరికి ఈ సందర్భంగా సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.
అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల సూచనలను ఆహ్వానిస్తున్నామన్నారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడం ద్వారా భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ వేశారని వివరించారు. అలాగే తాము సైతం తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలని అనుకున్నామన్నారు. అందుకు మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తదితరుల నుంచి ఎంతో స్ఫూర్తి పొందామని చెప్పారు.
తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని గుర్తు చేశారు. 2014లో శ్రీమతి సోనియా గాంధీతోపాటు నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని తెలిపారు. భారతదేశంలో యువ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని చెప్పారు. రానున్న పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
అలా బీజం పడింది: సీఎం రేవంత్
దేశానికి స్వాతంత్రం సిద్ధించి.. 2047లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని.. నాటికి మనం ఏం సాధించామో చెప్పాలని నిపుణులను కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. మనమేదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం… ప్రజల మద్దతు కోరుతామన్నారు. భవిష్యత్తు కోసం మన కలలు నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నామన్నారు. అందుకు అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నామన్నారు.
అదృష్టంగా భావిస్తున్నా: సీఎం రేవంత్
ఈ గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు రావడం మన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులతోపాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులకు సీఎం రేవంత్ ధన్యవాదాలు చెప్పారు. ఈ సమ్మిట్‌లో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
అపారమైన అవకాశాలు..
తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. మంచి సానుకూల వాతావరణం కూడా ఉందన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న రాష్ట్రాన్ని.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని తాము సంకల్పించామని చెప్పారు. దేశంలో తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉందని గుర్తు చేశారు. దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నామని స్పష్టం చేశారు. 2047 నాటికి భారత దేశ జీడీపీలో 10 శాతం వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది తమ లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు.
మూడు భాగాలుగా..
సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం.. ఇలా తెలంగాణను మూడు భాగాలుగా విభజించి.. ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్నామని వివరించారు. ఇలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే మొట్టమొదటిదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అందుకోసం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE) మోడల్స్ నిర్దేశించామని చెప్పారు.
తాము సైతం అదే నమూనా..
ఈ సందర్భంగా చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. చైనాలోనే ఈ ప్రావిన్స్ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని తెలిపారు. 20 ఏళ్లలో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులతోపాటు వృద్ధి రేటు సాధించారని వివరించారు. తెలంగాణలో సైతం తాము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నామని చెప్పారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి తామేంతో ప్రేరణ పొందామన్నారు. ప్రస్తుతం ఆయా దేశాలతో తాము పోటీ పడాలనుకుంటున్నామని తెలిపారు. ఈ తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీ అందరినీ ఆహ్వానించామన్నారు.
బలంగా విశ్వసిస్తున్నా: సీఎం రేవంత్ రెడ్డి
ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు.. కానీ ఆ విజన్‌ను సాధించగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమ టీమ్‌కు తాను చెప్పేదొక్కటేనన్నారు. కష్టంగా ఉంటే..వెంటనే చేపడుదాం. అసాధ్యం అని అనుకుంటే.. వారికి కొంత గడువు ఇస్తానని పేర్కొన్నారు. ఇవాళ తాను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నానన్నారు. నిన్నటిది ఒక కల, ఒక ప్రణాళిక… ఇవాళ మీరందరూ తమతో చేరారని.. ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు. మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా విశ్వసిస్తున్నానన్నారు. ఈ తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ.. Come and join the rise.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తూ.. తన ప్రసంగాన్ని ముగించారు.
ముగిసిన ఆరంభ వేడుకలు..
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం ఈ సమ్మిట్ ప్రారంభ వేడుకలు ముగిశాయి. ఆనంతరం వివిధ రంగాలపై సదస్సులు ప్రారంభమైనాయి. సెమీకండక్టర్ రంగంపై చర్చలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. విద్యా రంగంలో గ్లోబల్ సెంటర్‌గా తెలంగాణ చర్చ గోష్టిలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ
Read Latest Telangana News And Telugu News