Share News

Donald Trump Tariff: ఇరుదేశాలకూ నష్టమే!

ABN , Publish Date - Jul 31 , 2025 | 03:26 AM

భారత్‌పై ట్రంప్‌ సుంకాల బాదుడుతో.. ఇరు దేశాలకూ నష్టమేనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Donald Trump Tariff: ఇరుదేశాలకూ నష్టమే!

  • అమెరికాలో వినియోగదారులపై అధిక ధరల భారం

  • ఆ దేశంలో పెరగనున్న స్మార్ట్‌ఫోన్లు, ఆభరణాలు, రెడీమేడ్‌ దుస్తులు, ఆటో విడిభాగాలు, ఔషధాల ధరలు

  • మన ఆర్థిక వ్యవస్థపై రూ.2.5 లక్షల కోట్ల మేర ప్రభావం

న్యూఢిల్లీ, జూలై 30: భారత్‌పై ట్రంప్‌ సుంకాల బాదుడుతో.. ఇరు దేశాలకూ నష్టమేనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న పలు ఉత్పత్తులపై ఇన్నాళ్లుగా అతి తక్కువ సుంకాలు ఉండేవి. దీంతో ఆయా ఉత్పత్తులు అమెరికన్లకు చాలా చౌకగా అందుబాటులో ఉండేవి. ముఖ్యంగా.. స్మార్ట్‌ఫోన్లు, రెడీమేడ్‌ దుస్తులు, ఆటోమొబైల్‌ విడిభాగాలు, ఆభరణాలు, కట్‌, పాలిష్డ్‌ వజ్రాలు, పలు కీలక ఔషధాల ధరలు ట్రంప్‌ నిర్ణయంతో భారీగా పెరగనున్నాయి. ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ.. ‘కౌంటర్‌పాయింట్‌ రిసెర్చ్‌’ నివేదిక ప్రకారం స్మార్ట్‌ఫోన్లకు భారత్‌ ఇటీవలికాలంలో గ్లోబల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న మధ్య శ్రేణి ఆండ్రాయిడ్‌ ఫోన్లతోపాటు.. యాపిల్‌ ఫోన్ల కాంపొనెంట్లు కూడా భారత్‌లోనే అసెంబుల్‌ అవుతున్నాయి. ఇటీవలికాలంలో ఐఫోన్లు భారత్‌లో పెద్ద ఎత్తున తయారై అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వాటన్నింటిపైనా 25% సుంకం విధించడమంటే.. ఇప్పటికే ద్రవ్యోల్బణం దెబ్బకు విలవిలలాడుతున్న అమెరికన్‌ వినియోగదారులపై పెనుభారం మోపడమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘యేల్స్‌ బడ్జెట్‌ లాబ్‌’, ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌’ అంచనాల ప్రకారం.. తాజా సుంకాల పెంపుతో అమెరికాలో దుస్తుల ధరలు 175 దాకా పెరుగుతాయి. అమెరికా ప్రజలు వినియోగించే జనరిక్‌ ఔషధాల్లో 405 ఇండియా నుంచే సరఫరా అవుతున్నాయి. భారత్‌ ఎగుమతి చేసే ఔషధాల్లో క్యాన్సర్‌, మధుమేహం, హృద్రోగాలు, సాంక్రమిక వ్యాధులకు సంబంధించిన కీలక ఔషధాలు చాలా ఉన్నాయి. ట్రంప్‌ నిర్ణయంతో వాటన్నింటి ధరలూ పెరుగుతాయి. 2023లో భారత్‌ నుంచి అమెరికాకు 2.2 బిలియన్‌ డాలర్ల విలువైన ఆటోమొబైల్‌ విడిభాగాలు ఎగుమతి అయ్యాయి. అమెరికన్‌ వాహన తయారీదారులు.. తమ ఉత్పత్తి ఖర్చులను తక్కువగా ఉంచుకోవడానికి భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపైనే ఆధారపడుతున్నారు. ఇకపై వాటి ధరలు కూడా పెరగనుండడంతో.. సగటు అమెరికన్ల కారు మరమ్మతుల ఖర్చులు పెరుగుతాయి.


మనమీదా..

ట్రంప్‌ సుంకాల ప్రభావం సగటు అమెరికన్లపైనే కాక.. భారత జీడీపీపైనా గణనీయంగా పడే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్‌ ఏప్రిల్‌లోనే అంచనా వేసింది. అప్పట్లో ట్రంప్‌ ప్రకటించిన 265 టారిఫ్‌ ప్రభావం భారత జీడీపీపై 30 బిలియన్‌ డాలర్ల మేర (దాదాపు రూ.2.5 లక్షల కోట్లు) ఉంటుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. 2025 క్యాలెండర్‌ సంవత్సరంలో భారత జీడీపీ రూ.4.3 లక్షల కోట్ల డాలర్లలో ఇది దాదాపుగా 0.7 శాతానికి సమానం. ఇప్పుడు.. 25 శాతం సుంకం, దానికి తోడుగా జరిమానా కూడా విధిస్తే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా గనక 20 శాతం అంతకంటే ఎక్కువ సుంకాన్ని గంపగుత్తగా విధిస్తే.. భారత జీడీపీపై 50 బేసిస్‌ పాయింట్ల మేర (0.5%) ప్రభావం పడుతుందని అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మాక్వరీ గతంలోనే హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 03:26 AM