Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసు
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:26 PM
కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఐదు ఎన్నికల హామీలను ఇచ్చిందని, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు ఇవి విరుద్ధమని పిటిషనర్ గతంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ: కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాల వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు నోటీసులు ఇచ్చింది. 2023లో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య ఎన్నికను సవాలు చేస్తూ ఆ నియోజకవర్గం ఓటరు కె.శంకర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిద్ధరామయ్యను కోర్టు ఆదేశించింది.
కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఐదు ఎన్నికల హామీలను ఇచ్చిందని, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు ఇవి విరుద్ధమని పిటిషనర్ గతంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సిద్ధరామయ్య అంగీకారంతోనే మేనిఫెస్టో విడుదల చేసినందున సిద్ధరామయ్య అవినీతికి పాల్పడ్డారని పిటిషన్ వాదించారు. సిద్ధరామయ్య ఎన్నిక చెల్లదని ప్రకటించాలని, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా డిబార్ చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి సునీల్ దత్ యాదవ్ కొట్టివేశారు. ఎన్నికల్లో హామీలివ్వడం అవినీతికి పాల్పడటం కాదని పేర్కొన్నారు. దీనిపై పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిద్ధరామయ్య 2023 ఎన్నికల్లో వరుణ నియోజకవర్గం నంచి ఎన్నికై ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు.
ఇవి కూడా చదవండి..
జిన్నా వ్యతిరేకిస్తే నెహ్రూ సమర్థించారు.. వందేమాతరంపై చర్చలో మోదీ
వందేమాతర గీతం దేశం ముక్కలు కాకుండా కాపాడింది.. లోక్‌సభలో మోదీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి