Siddaramaiah: యతీంద్ర అలా అనలేదు.. కుమారుడి వ్యాఖ్యలపై సిద్ధరామయ్య
ABN , Publish Date - Oct 25 , 2025 | 02:49 PM
బెళగావి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర మాట్లాడుతూ, తన తండ్రి రాజకీయ కెరీర్ చివరి దశలో ఉందన్నారు. ఈ పరిస్థితిలో బలమైన, ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు కావాలని, ఆయనకు సిద్ధరామయ్య మార్గదర్శిగా ఉంటారని చెప్పారు.
బెంగళూరు: కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై కొద్దికాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనయుడు, ఎమ్మెల్సీ యతీంద్ర (Yathindra) ఇటీవల చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. దీనిపై సిద్ధరామయ్య (Siddaramaiah) తొలిసారి స్పందించారు. యతీంద్ర వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు.
'అసలు ఏమి చెప్పదలచుకున్నావని యతీంద్రను నేను అడిగాను. తన సిద్ధాంతాల గురించే చెప్పాలని అనుకున్నట్టు యతీంద్ర తెలిపాడు. ఫలానా వ్యక్తి సీఎం కావాలని యతీంద్ర అనలేదు' అని సిద్ధరామయ్య వివరించారు. బెళగావి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర మాట్లాడుతూ, తన తండ్రి రాజకీయ కెరీర్ చివరి దశలో ఉందన్నారు. ఈ పరిస్థితిలో బలమైన, ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు కావాలని, ఆయనకు సిద్ధరామయ్య మార్గదర్శిగా ఉంటారని చెప్పారు. సతీష్ జార్కిహోళికి ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పారు. ఉప మఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని కొద్దికాలంగా సొంత పార్టీ నేతలు పలువురు డిమాండ్ చేస్తున్న క్రమంలో సతీష్ జార్కిహోళి పేరును యంత్రీంద్ర తెరపైకి తీసుకు రావడం చర్చనీయాంశమైంది.
డీకే స్పందనిదే
సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పాలన నవంబర్ 20తో ముగుస్తున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు జరుగనుందనే ప్రచారం జరుగుతోంది. సీఎం పీఠాన్ని ఆశిస్తున్న శివకుమార్ తాజాగా యతీంద్ర వ్యాఖ్యలపై స్పందించారు. 'పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు నేను మాట్లాడను. సంబంధిత వ్యక్తులతోనే మాట్లాడతాను' అని డీకే తెలిపారు. ఆ ప్రకారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, జనరల్ సెక్రటరీ-కర్ణాటక ఇన్‌చార్జి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా దృష్టికి ఈ విషయాన్ని డీకే తీసుకువెళ్లే అవకాశం ఉంది.
కాగా, యతీంద్రపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు ఇక్బాల్ హుస్సేన్, వి.శివగంగ డిమాండ్ చేశారు. ఇటీవల డీకే ముఖ్యమంత్రి కావాలని ప్రకటనలు చేసినందుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. యతీంద్ర వ్యాఖ్యలపై ఇక్బాల్ ఘాటుగా స్పందించారు. మేము ప్రకటన చేస్తే బలవంతంగా (బలాత్కార్) చేసినట్టు, యతీంద్ర ప్రకటన చేస్తే చమత్కారం (మ్యాజిక్) చేసినట్టు అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుమారుడు పరిపక్వత లేని వ్యాఖ్యలు చేశారని, ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని అన్నారు. తాము వ్యక్తిగతంగా ప్రకటనలు చేస్తే షోకాజ్ ఇచ్చినప్పుడు ఎంత సీఎం కుమారుడైనా యతీంద్రపై కూడా అధిష్టానం చర్చలు తీసుకోవాలని శివగంగ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర డాక్టర్ సూసైడ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి