PM Modi: నితీశ్ నేతృత్వంలో ఎన్డీయే రికార్డులు బద్దలు కొడుతుంది
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:29 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీశ్ నేతృత్వంలో ఎన్డీయే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని ప్రధాని మోదీ చెప్పారు.
ఎన్డీయే సీఎం అభ్యర్ధిపై సందిగ్ధత తొలగించిన ప్రధాని
పట్నా, అక్టోబరు 24: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీశ్ నేతృత్వంలో ఎన్డీయే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. అభివృద్ధిలో బిహార్ దూసుకుపోతుందని, మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఘన విజయం సాధించబోతుందన్నారు. బిహార్‌లోని బెగుసరాయ్, సమస్తీపూర్ జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న ఆయన ఎన్డీయే సీఎం అభ్యర్థిపై నెలకొన్న సందిగ్ధతను తొలగించారు. సభకు హాజరైన వారితో సెల్‌ఫోన్ లైట్ ఆన్ చేయించి... ఎన్డీయే పాలనలో కావాల్సినంత వెలుగుండగా విపక్ష మహాగఠ్‌బంధన్ లాంతరు(ఆర్జేడీ ఎన్నికల గుర్తు) అవసరమా అని మోదీ ప్రశ్నించారు. గత 11 ఏళ్లుగా యూపీయే హయాం కంటే మూడింతల ఎక్కువ నిధులు బిహార్‌కు ఇచ్చినట్లు మోదీ చెప్పారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు కీలకమని చెబుతూ పార్లమెంట్‌లో మహిళా బిల్లు పెట్టినప్పుడు ఆర్జేడీ కాంగ్రెస్ అడ్డుకున్నాయని చెప్పారు. అయితే, బిహార్‌లో ఎన్డీయే గెలిచినా నితీశ్‌ను సీఎం చేయరని మహాగఠ్‌బంధన్ సీఎం అభ్యర్ధి తేజస్వీ యాదవ్ అన్నారు. నితీశ్‌ను మోదీ, షా హైజాక్ చేశారని ఆరోపించారు.
యువత సాధికారత కోసం కృషి చేస్తున్నాం
దేశంలోని యువత సాధికారత కోసం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలను తృటిలో కోల్పోయిన వారికి ప్రైవేటు రంగంలో అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో 17వ రోజ్‌గార్(ఉద్యోగ) మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 51 వేల మందికి నియామక పత్రాలను అందించారు. ఈ మేళాను ఉద్దేశించి ప్రధాని సందేశమిచ్చారు. ఇప్పటి వరకు నిర్వహించిన రోజ్‌గార్ మేళాలలో 11 లక్షల మందికి నియామకపత్రాలు అందించామన్నారు. ‘ప్రతిభ సేతు’ పోర్టల్‌ను తీసుకువచ్చామన్న ఆయన.. అఖిల భారత ఉద్యోగ నియామకాల్లో తృటిలో అవకాశం కోల్పోయిన వారికి కొత్త అవకాశాలు సృష్టించడమే ఈ పోర్టల్ లక్ష్యమన్నారు.