Share News

Rahul Gandhi: రాహుల్ ఓటు చోరీ వ్యాఖ్యలపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Oct 13 , 2025 | 04:38 PM

బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల జాబితా అవకతవకలపై ఆగస్టు 7న రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఉటంకిస్తూ న్యాయవాది, కాంగ్రెస్ సభ్యుడు రోహిత్ పాండే ఈ పిటిషన్ వేశారు.

Rahul Gandhi: రాహుల్ ఓటు చోరీ వ్యాఖ్యలపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
Rahul Gandhi

న్యూఢిల్లీ: ఎన్నికల జాబితాలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటూ లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల పలు సందర్భాల్లో ఆరోపించారు. ఆయన ఆరోపణలపై విచారణకు మాజీ జడ్జి సారథ్యంలో ప్రత్యేక విచారణ బృందం (SIT) ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు తోసిపుచ్చింది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ (ECI)ను ఆశ్రయించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది.


'పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన విన్నాం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు నిరాకరిస్తున్నాం. కావాలనుకుంటే ఈసీఐను పిటిషనర్ ఆశ్రయించవచ్చు' అని ధర్మాసనం పేర్కొంది. బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల జాబితా అవకతవకలపై ఆగస్టు 7న రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఉటంకిస్తూ న్యాయవాది, కాంగ్రెస్ సభ్యుడు రోహిత్ పాండే ఈ పిటిషన్ వేశారు. ఎన్నికల జాబితా సన్నాహకాలు, నిర్వహణ, పబ్లికేషన్ విషయాల్లో ఈసీ పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును ఆయన కోరారు. అర్ధవంతమైన వెరిఫికేషన్, ఆడిట్, పబ్లిక్ స్క్రూటినీకి వీలుగా మెషీన్-రీడబుల్ ఫార్మెట్‌లో ఎన్నికల జాబితాను పబ్లిష్ చేయాలని కూడా కోరారు.


కాగా, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం దొంగిలించిన ఓట్లతో ఏర్పడిందంటూ రాహుల్ పదేపదే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కొందరు పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రజల ఓటు హక్కును దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ విషయంలో బీజేపీ విజయవంతమైందని, అయితే బీహార్‌లో మాత్రం ఓట్ల చోరీ జరగనీయమన్నారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ నేతలతో పాటు ఎన్నికల కమిషన్ అధికారులు తోసిపుచ్చారు. రాహుల్ తన ఆరోపణలను తగిన ఆధారాలు చూపిస్తూ అఫిడవిట్‌తో ముందుకు రావాలని ఈసీ సూచించింది.


ఇవి కూడా చదవండి..

ఐఆర్‌సీటీసీ హోటల్స్ టెండర్స్ కేసు.. ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్

పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 13 , 2025 | 04:40 PM