Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌బీబీఎస్ స్టూడెంట్ అత్యాచారం కేసు.. సంచలన విషయాలు వెలుగులోకి..
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:15 AM
ఎమ్‌బీబీఎస్ విద్యార్థిని అత్యాచార ఉదంతంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అర్ధరాత్రి విద్యార్థిని బయటకు వెళ్లినట్టు సీఎం తెలపగా, రాత్రి 8 గంటల సమయంలో ఆమె బయటకు వచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో ఎమ్‌బీబీఎస్ విద్యార్థిని అత్యాచారానికి గురైన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది. ఈ కేసుపై స్పందిస్తూ సీఎం మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. ప్రైవేటు కాలేజీ విద్యార్థిని అర్ధరాత్రి వేళ క్యాంపస్ వదిలి ఎలా బయటకు రాగలిగారని ప్రశ్నించారు (WB CM Controversial Remarks). విద్యార్థుల భద్రతా వ్యవహారాల బాధ్యత యాజమాన్యాలదే అని అన్నారు. అయితే, బాధితురాలిపై రాత్రి 8 గంటల సమయంలో అఘాయిత్యం జరిగినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
తన కూతురు రాత్రి 8 గంటల సమయంలో బయటకు వెళ్లిందని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆ సమయంలోనే ఈ దారుణం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్‌లో కూడా ఇదే విషయాన్ని నమోదు చేసినట్టు తెలిసింది (West Bengal Rape Incident).
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. సీఎం అసత్యాలు పలుకుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ మండిపడ్డారు. ‘అప్ఘానిస్థాన్ వలెనే పశ్చిమ బెంగాల్‌లో కూడా మమతా బెనర్జీ సారథ్యంలో తాలిబాన్ల తరహా పాలన సాగుతోంది. రాష్ట్రంలో అర్ధరాత్రి మహిళలు బయటకు వెళ్లరని ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే..రాత్రి బయటకు వెళితే దారుణాలు జరుగుతాయని సీఎం చెప్పదలుచుకున్నారా?’ అని ప్రశ్నించారు.
సీపీఎం రాష్ట్ర సెక్రెటరీ మొహమ్మద్ సలీమ్ కూడా సీఎం స్టేట్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాలిబాన్ల పాలన కొనసాగుతోందా అని ప్రశ్నించారు. ‘ఆర్‌జీ కార్ కేసులో పోలీసులు విచారణను తప్పుదారి పట్టించారు. క్రిమినల్స్‌కు కొమ్ముకాశారు. అప్పుడు కూడా ఇలాగే మహిళలు అర్ధరాత్రి పని చేయకూడదని అన్నారు. రాజారామ్ మోహన్ రాయ, విద్యాసాగర్ వంటి సంఘ సంస్కర్తల ఉన్నతాశయాలకు ఇది విరుద్ధం. పురుషులు మహిళలు సమానమే. సీఎం ఎప్పుడూ మహిళలపైనే నెపం నెట్టే ప్రయత్నం చేస్తారు’ అని అన్నారు.
తన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో సీఎం బెనర్జీ స్పందిస్తూ మీడియాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు. ‘మీరు ఓ ప్రశ్న అడుగుతారు. నేను సమాధానం చెబుతాను. మీరు దాన్ని వక్రీకరిస్తారు. ఇలాంటి రాజకీయాలు చేయకండి’ అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
ఆదాయం లేదు.. మళ్లీ నటనవైపు మళ్లుతా.. మంత్రి పదవి నుంచి తప్పుకుంటా: సురేశ్ గోపి
శబరిమల గర్భగుడి తాపడాల బరువులో తగ్గుదల.. వెలుగులోకి సంచలన విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి