Suresh Gopi: ఆదాయం లేదు.. మళ్లీ నటనవైపు మళ్లుతా.. మంత్రి పదవి నుంచి తప్పుకుంటా: సురేశ్ గోపి
ABN , Publish Date - Oct 13 , 2025 | 09:49 AM
తాను మంత్రి పదవి నుంచి తప్పుకుని నటనవైపు మళ్లుతానని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ అన్నారు. తనకు ఆదాయం లేదని చెప్పుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: మళ్లీ యాక్టింగ్ వైపు మళ్లే యోచనలో ఉన్నట్టు కేంద్ర మంత్రి, బీజేపే ఎంపీ సురేశ్ గోపీ(Suresh Gopi) తెలిపారు. కేరళలోని కన్నుర్‌లో రాజ్యసభ ఎంపీ సదానందన్ మాస్టర్ అధికారిక కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. మంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత తన ఆదాయం బాగా తగ్గిపోయిందని అన్నారు. దాదాపుగా నిలిచిపోయిందని కామెంట్ చేశారు. ఆదాయం కోసం మళ్లీ నటనపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్టు తెలిపారు. తన స్థానంలో రాజ్యసభ ఎంపీ సదానందన్‌ను నియమించాలని కూడా ప్రతిపాదించానని అన్నారు. పార్టీలో తానే అత్యంత పిన్న వయస్కుడినని తెలిపారు. 2008లో పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న తనను కేంద్ర మంత్రిని చేయాలని పార్టీ భావించినట్టు తెలిపారు.
మళయాళం ఇండస్ట్రీలో ప్రముఖ నటుడైన సురేశ్ గోపీ త్రిసూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో తొలి బీజేపీ ఎంపీగా రికార్డు సృష్టించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు పెట్రోలియం శాఖ సహాయమంత్రి బాధ్యతలను అప్పగించింది.
సినిమా రంగానికి ఎంతో సేవ చేసిన ఆయనను 2016లోనే బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆ తరువాత 2019 నాటి లోక్ సభ ఎన్నికల్లో, 2021 నాటి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సురేశ్ గోపీ పోటీ చేసి ఓటమి చెందారు. అయితే, గత ఏడాది పార్లమెంటు ఎన్నికల్లో త్రిసూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఘన విజయాన్ని అందుకున్నారు. తన ప్రత్యర్థి అయిన సీపీఎం నేత వీఎస్ సునీల్ కుమార్‌పై 74 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
అయితే, సురేశ్ గోపి గతంలోనూ మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని కామెంట్ చేశారు. తను యాక్టింగ్ వైపు మళ్లే యోచనలో ఉన్నట్టు అప్పట్లో తెలిపారు. కొన్ని మూవీ ప్రాజెక్టులకు సంబంధించి మాట ఇచ్చానని అప్పట్లో అన్నారు. ఇక కేరళలో బీజేపీ సీనియర్ నేత అయిన సదానందన్ మాస్టర్‌ను ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్య సభకు నామినేట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
శబరిమల గర్భగుడి తాపడాల బరువులో తగ్గుదల.. వెలుగులోకి సంచలన విషయాలు
భారత్‌లో యూకే యూనివర్సిటీల ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు: బ్రిటన్ ప్రధాని
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి