Sabarimala Gold: శబరిమల గర్భగుడి తాపడాల బరువులో తగ్గుదల.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:03 PM
శబరిమల గర్భగుడి ద్వారపాలక విగ్రహాల బంగారు తాపడాల కాంట్రవర్సీ కొనసాగుతోంది. ఈ అంశంపై కేరళ హైకోర్టులో కూడా విచారణ జరగుతోంది. అయితే, తాపడాలకు ఏమైందనే విషయంలో జాతీయ మీడియాలో పలు ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: శబరిమల ఆలయంలో గర్భగుడి ద్వారపాలక విగ్రహాలకు అమర్చిన బంగారు తాపడాలు బరువు తగ్గడంపై ప్రస్తుతం కేరళ హైకోర్టులో విచారణ జరుగుతుంది. బంగారు తాపడాల విషయంలో అన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని న్యాయస్థానం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, తాపడాలకు అసలు ఏమైందనే అంశంపై జాతీయ మీడియాలో పలు ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి.
జరిగింది ఇదీ..
శబరిమల గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారు తాపడాలను మరమ్మతుల కోసం 2019లో తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోగ్రాములు. వాటిని సరి చేయించేందుకు ఉన్నికృష్ణన్ అనే స్పాన్సర్ ముందుకొచ్చారు. అయితే, వాటిని తిరిగి ద్వారపాలక విగ్రహాలకు అమర్చే సమయానికి బరువు కేవలం 38.25 కేజీలకు తగ్గిపోయింది. ఇది వివాదానికి దారి తీసింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, తాపడాలను పునరుద్ధరించేందుకు చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ అనే సంస్థకు తరలించాలి. అయితే, షెడ్యూల్ ప్రకారం కాకుండా దాదాపు 39 రోజుల ఆలస్యంగా అవి ఆగస్టు 29న చెన్నైకి చేరుకున్నాయి. ఈ మధ్య కాలంలో తాపడాలను పలు ప్రాంతాలకు తీసుకెళ్లినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కొట్టయాంలోని ఓ దేవాలయంతో పాటు ఏపీలోని కొన్ని దేవాలయాలు, బెంగళూరులోని అయ్యస్వామి గుడికి తరలించారని సమాచారం. మళయాళ నటుడు జయరామ్ ఇంట జరిగిన ఓ ప్రత్యేక పూజ కార్యక్రమంలో కూడా తాపడాలను పెట్టారని తెలుస్తోంది.
చివరగా మరమ్మతుల అనంతరం అవి సెప్టెంబర్ 11న శబరిమలకు చేరుకున్నాయి. అప్పటికే వాటి బరువు అనుమానాస్పద రీతిలో తగ్గిపోయింది. యాక్టర్ జయరామ్ ఇంట్లో జరిగిన ఓ పూజా కార్యక్రమంలో తాపడాలను పెట్టినట్టు స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ కూడా ఫేస్ బుక్ పోస్టులో తెలిపింది. తమ వద్దకు వచ్చిన తాపడాల బరువు 38.28 కేజీలేనని తెలిపింది. ఈ నేపథ్యంలో అసలు శబరిమలను వీడిన తాపడాలే స్మార్ట్ క్రియేషన్స్‌కు చేరుకున్నాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాపడాలను భద్రపరిచే బాధ్యతను ఎవరు తీసుకున్నారన్న దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కేరళ రాజకీయ పక్షాలు, లిటిగెంట్లు కూడా ఇదే అంశాలను లేవనెత్తుతున్నారు.
మీడియా కథనాల ప్రకారం 1998లో వ్యాపారవేత్త విజయ్‌మాల్య.. శబరిమల గుర్భగుడి కోసం 30 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది మరో 800 గ్రాముల బంగారం తలుపుల తాపడాల కోసం విరాళంగా దేవస్థానానికి అందింది. ఈ విషయంలో అన్ని డాక్యుమెంట్స్‌ను సేకరించి సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కేరళ హైకోర్టు డివిజన్ బెంజ్ ఆదేశించింది. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు, ఈ అంశం రాజకీయంగా కూడా వివాదాస్పదం అవుతోంది. ఈ విషయంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
భారత్‌లో యూకే యూనివర్సిటీల ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు: బ్రిటన్ ప్రధాని
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు.. కర్ణాటక కేబినెట్ ఆమోదం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి