Lalu Prasad Yadav: ఐఆర్‌సీటీసీ హోటల్స్ టెండర్స్ కేసు.. ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్
ABN , Publish Date - Oct 13 , 2025 | 01:51 PM
బిహార్‌లో ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి భారీ షాక్ తగిలింది. ఐఆర్‌సీటీసీ హోటల్స్ నిర్వహణ టెండర్స్ కేసులో కోర్టు లాలూ, ఆయన కుటుంబంపై అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాలను మోపింది.
ఇంటర్నెట్ డెస్క్:బిహార్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులకు గట్టి షాక్ తగిలింది. ఐఆర్‌సీటీసీ హోటల్ టెండర్స్ కేసులో లాలూతో (Lalu Prasad Yadav) పాటు ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌పై ఢిల్లీ కోర్టు అభియోగాలు దాఖలు చేసింది. మోసం, నేర పూరిత కుట్ర తదితర అభియోగాలను మోపింది (IRCTC Hotels Scam Case).
2004-09 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కామ్ బయటపడింది. ఐఆర్‌సీటీసీ హోటల్స్‌ల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్ట్‌ల కేటాయింపులో అవినీతి (Corruption) జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఐఆర్‌సీటీసీకి చెందిన బీఎన్ఆర్ రాంచీ, బీఎన్ఆర్ పూరీ హోటల్స్ నిర్వహణ కాంట్రాక్ట్‌ను సుజాతా హోటల్‌కు ఇచ్చారు. అయితే, ఈ కాంట్రాక్ట్ కేటాయింపు తరువాత తాలూకు మూడు ఎకరాల విలువైన స్థలం ఓ బినామీ కంపెనీ ద్వారా లభించిందని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు 2017లో లాలూతో పాటు ఆయన కుటుంబసభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
నిందితులపై అభియోగాలు దాఖలు చేసేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని సీబీఐ తాజాగా కోర్టుకు తెలిపింది. అయితే, లాలూ తరపు న్యాయవాది మాత్రం ఈ వాదనలను తోసిపుచ్చారు. పారదర్శక రీతిలో కాంట్రాక్ట్‌ల కేటాయింపులు జరిగాయని అన్నారు.
అయితే, కోర్టు మాత్రం సీబీఐ వాదనలతో ఏకీభవించింది. ఈ కేసులో కుట్ర కోణం ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి అర్థమవుతోందని పేర్కొంది. భూమి పొందినందుకు ప్రతిగా అధికార దుర్వినియోగం, టెండర్ల ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగినట్టు వెల్లడించింది.
బిహార్‌లో వచ్చే నెల 6, 11 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో, అక్కడ ప్రచార పర్వం ఊపందుకుంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ భారీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో లాలూకు స్పీడుకు బ్రేకులేసేలా కోర్టు తీర్పు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి:
ఆదాయం లేదు.. మళ్లీ నటనవైపు మళ్లుతా.. మంత్రి పదవి నుంచి తప్పుకుంటా: సురేశ్ గోపి
శబరిమల గర్భగుడి తాపడాల బరువులో తగ్గుదల.. వెలుగులోకి సంచలన విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి