Bihar Assembly Elections: అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఆర్జేడీ
ABN , Publish Date - Oct 20 , 2025 | 01:21 PM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలపనున్న 143 మంది అభ్యర్థుల జాబితాను రాష్ట్రీయ జనతా దళ్ ప్రకటించింది.
పాట్నా, అక్టోబర్ 20: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను వివిధ రాజకీయ పార్టీలు విడుదల చేస్తున్నాయి. తాజాగా 143 మంది అభ్యర్థుల జాబితాను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సోమవారం పాట్నాలో విడుదల చేసింది. మాజీ సీఎం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్.. వైశాలి జిల్లాలోని రాఘోపుర్ నుంచి బరిలో దిగుతున్నారు. గతంలో ఈ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, రాబ్రి దేవీలు బరిలో నిలిచి గెలుపొందిన సంగతి తెలిసిందే.
ఇండి కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ.. తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఇప్పటికే ఈ కూటమిలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ పార్టీ మూడు విడతలుగా 60 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అలాగే ఈ కూటమిలో భాగస్వామ పక్షాలైన సీపీఐ (ఎమ్ఎల్) ఎల్, సీపీఐ (ఎం), సీపీఐ, వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో కలిసి కాంగ్రెస్, ఆర్జేడీ ఎన్నికలకు వెళ్తున్నాయి.
తొలి దశ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లు ఉప సంహరించుకునే ప్రక్రియ సోమవారం మధ్యాహ్నంతో ముగియనుంది. ఈ తొలి దశలో మొత్తం 20 జిల్లాల్లోని 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మరోవైపు ఇండి కూటమిలో సీట్ల పంపకాల విషయంలో సమస్యలున్న మాట వాస్తవమేనని కాంగ్రెస్ పార్టీ నేత సురేంద్ర రాజ్‌పుత్ వెల్లడించారు. ఈ సమస్యలను చర్చల ద్వారా తాము పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. అయితే తొలి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 17వ తేదీతోనే ముగిసిన సంగతి తెలిసిందే.
243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 6, 11 తేదీల్లో ఈ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14వ తేదీన వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ద్వారా మరోసారి అధికారాన్ని నిలుపుకోవాలని ఎన్డీయే భావిస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఇండి కూటమి కృత నిశ్చయంతో ఉంది. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కట్టాడనేది నవంబర్ 14వ తేదీన తెలిపోనుంది. ఇంకోవైపు ఈ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహాకర్త, జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపుతున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ పేరు వింటే.. శత్రువులకు నిద్ర పట్టదు: ప్రధాని మోదీ
స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయండి: ప్రధాని మోదీ
For More National News And Telugu News