BAP MLA: అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా రూ.20లక్షలకు ఫిక్సింగ్.. ఎమ్మెల్యే అరెస్ట్..
ABN , Publish Date - May 05 , 2025 | 10:15 AM
అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో ఎమ్మెల్యే అరెస్టయ్యారు. అసెంబ్లీలో మైనింగ్‌పై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే.. ప్రశ్నలు అడగకుండా ఉండేందుకు రూ.20లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేసులో..
అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో ఎమ్మెల్యే అరెస్టయ్యారు. అసెంబ్లీలో మైనింగ్‌పై చర్చ జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే.. ప్రశ్నలు అడగకుండా ఉండేందుకు రూ.20లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేసులో సదరు ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ (Rajasthan) జిల్లాలోని కరౌలి జిల్లాలోని తోడభీమ్ బ్లాక్‌లో మైనింగ్ లీజులకు సంబంధించి అసెంబ్లీలో గతంలో చర్చ నడిచింది. దీనిపై బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ (BAP) ఎమ్మెల్యే (MLA) జైకృష్ణ పటేల్ ప్రశ్నించారు. అయితే మళ్లీ మైనింగ్‌పై ప్రశ్నలు అడగకుండా ఉండేందుకు సదరు మైనింగ్ యజమాని నుంచి ఎమ్మెల్యే రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. చివరకు రూ.2.5 కోట్లకు ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి ముందుగా రూ.1లక్ష అందించారు. తర్వాత రూ.20 లక్షలు (RS 20 lakh bribe) ఇవ్వాల్సి ఉంది.
ఈ క్రమంలో డబ్బు తీసుకునేందుకు.. జైపూర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని సంబంధిత వ్యక్తులను ఎమ్మెల్యే పిలిపించారు. జైకృష్ణ చెప్పినట్లుగానే సదరు మైనింగ్ వారు రూ.20లక్షలను అందించారు. ఆ డబ్బును ఎమ్మెల్యే.. తన అనుచరుడికి ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే అయితే అదే సమయంలో ఏసీబీ అధికారులు ఎంటరై.. ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయబోతున్నట్లు సీఎం భజన్‌లాల్, స్పీకర్ వాసుదేవ్‌కి తెలియజేసి, ముందస్తు అనుమతి తీసుకున్నారని తెలిసింది. ఎమ్మెల్యే డబ్బు తీసుకుంటున్నట్లు తమ వద్ద ఆడియో, వీడియో ఫుటేజ్‌లు ఉన్నట్లు ఏసీబీ డైరెక్టర్ రవి ప్రకాష్ మెహర్దా తెలిపారు. డబ్బు సంచితో పారిపోయిన ఎమ్మెల్యే అనుచరుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎమ్మెల్యే లంచం తీసుకుంటూ పట్టుబడటం రాష్ట్ర ఏసీబీ చరిత్రలో ఇదే మొదటి సారని ఏసీబీ డీజీ రవిప్రకాశ్ తెలిపారు. కాగా, ఎమ్మెల్యే కృష్ణ పటేల్ గత ఏడాది జరిగిన బగిడోరా ఉప ఎన్నికల్లో భారత్ ఆదివాసీ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాగిడోరా నియోజకవర్గం నుంచి గెలుపుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేంద్రజిత్ మాల్వియా బీజేపీలో చేరారు. దీంతో అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడంతో ఆ స్థానం ఖాలీ అయింది. దీంతో ఉప ఎన్నికల్లో జైకృష్ణ పటేల్ బీజేపీ అభ్యర్థి సుభాష్ తంబోలియాపై 51 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన