Rahul Gandhi Letter To PM: సంక్షోభం పెద్దది, రిలీఫ్ చిన్నది.. పంజాబ్ వరదలపై మోదీకి రాహుల్ లేఖ
ABN , Publish Date - Sep 17 , 2025 | 09:21 PM
పంజాబ్ వరదల్లో జరిగిన నష్టంపై కేంద్రం తక్షణమే పారదర్శక, కచ్చితమైన అంచనా చేపట్టాలని, సమగ్ర సహాయ పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.
న్యూఢిల్లీ: వరదలతో తీవ్ర సంక్షోభంలో పడిన పంజాబ్ (Punjab)కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1,600 కోట్ల సాయంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెదవి విరిచారు. కేంద్రం ప్రకటించిన అరకొర సాయంతో పంజాబ్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అకాల వర్షాలతో పంజాబ్ విపరీతంగా నష్టపోయిందని, 4 లక్షల ఎకరాలకు పైగా వరిపంటకు నష్టం జరిగిందని, 10 లక్షలకు పైగా జంతువులు చనిపోయాయని తెలిపారు. అలాగే లక్షలాది మంది అణగారిన వర్గాల వారు ఇళ్లను కోల్పోయారని, వరదలతో భూములు సాగుకు పనికిరాకుండా పోయాయని అన్నారు. వర్షాల వల్ల పంజాబ్‌లో రూ.20,000 కోట్ల మేరకు నష్టం జరిగిందన్నారు. ఆ మొత్తాన్ని కేంద్రం ఇవ్వాలని కోరారు. పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం కేవలం రూ.1,600 కోట్ల ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ మేరకు పంజాబ్ వరదలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి రాహుల్ గాంధీ లేఖ (Letter) రాశారు.
'సంక్షోభం పెద్దది అయినప్పుడు స్పందన కూడా అంతకంటే సమర్థవంతంగా ఉండాలి' అని రాహుల్ గాంధీ ఆ లేఖలో పేర్కొన్నారు. జరిగిన నష్టంపై కేంద్రం తక్షణం పారదర్శక, కచ్చితమైన అంచనా చేపట్టాలని, సమగ్ర సహాయ పునరావాస ప్యాకేజీని ప్రకటించాలని కోరారు. వరదల కారణంగా పెద్దఎత్తున భూములు సమీప భవిష్యత్తులో సాగుకు పనికిరాకుండా పోయే పరిస్థితి ఉందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజుకూ వేలాది ఎకరాలు వరదనీటిలో మునిగిపోయాయని, అనేక గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు.
పంజాబ్‌లో ఇటీవల రాహుల్ గాంధీ పర్యటించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల కుటుంబాలను కలుసుకున్నారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న గురుదాస్‌పూర్‌లోని రైతులతో మాట్లాడారు. కాగా, పంజాబ్‌లో ఇటీవల పర్యటించిన ప్రధాని అక్కడి పరిస్థితిపై ఏరియల్ సర్వే జరిపారు. ఈనెల 9న పంజాబ్‌కు రూ.1,600 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోదీకి రాహుల్ లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి..
లీకులతో నా కుమారుడి గౌరవం దెబ్బతింది.. తాజా దర్యాప్తునకు పైలట్ తండ్రి డిమాండ్
ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Read Latest National News and Telugu News