Air India Plance Crash: లీకులతో నా కుమారుడి గౌరవం దెబ్బతింది.. తాజా దర్యాప్తునకు పైలట్ తండ్రి డిమాండ్
ABN , Publish Date - Sep 17 , 2025 | 08:31 PM
బోయింగ్ 787-8 విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో పైలట్ కెప్టెన్ సుమీత్ సబర్వాల్ ఒకరు. కాగా, ఈ దుర్ఘటనపై తిరిగి దర్యాప్తు జరిపించాలని కెప్టెన్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకన్లలోనే కూలిపోయిన దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. బోయింగ్ 787-8 విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పైలట్లలో ఒకరైన కెప్టెన్ సుమీత్ సబర్వాల్ (Captain Sumeet Sabharwal)తో సహా విమానంలోని 241 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. కాగా, ఈ దుర్ఘటనపై తిరిగి దర్యాప్తు జరిపించాలని కెప్టెన్ సబర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ (Pushkaraj Sabharwal) డిమాండ్ చేశారు. రిటైర్డ్ ప్రభుత్వ అధికారి అయిన 91 ఏళ్ల పుష్కరాజ్ ఈ మేరకు సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్‌క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)కు లేఖ రాశారు.
ఎయిర్ క్రాఫ్ట్ (ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్) నిబంధనలు-2017లోని రూల్-12 కింద లాంఛనపూర్వక దర్యాప్తు (Formal inquiry) జరిపించాలని పుష్కరాజ్ సబర్వాల్ ఆ లేఖలో కోరారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ.. ముఖ్యంగా సెలక్టివ్ లీక్‌లు, ఊహాగానాలతో సాగుతోందని.. ఇది తన కుమారుడి గౌరవానికి (మరణాంతరం), అతని మానసిక పరిస్థితిపై అపోహలకు దారితీస్తోందన్నారు. ఈ పరిణామాలు తన ఆరోగ్యం, మానసిక పరిస్థితిపై, కెప్టెన్ సుమీత్ సభర్వాల్ గౌరవంపైనా ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు ఆగస్టు 29న రాసిన లేఖలో పుష్కరాజ్ పేర్కొన్నారు. తన కుమారుడు మానిసిక ఒత్తిడికి గురైనట్టు, భార్యతో విడాకులు, తల్లి మరణం వంటి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
'కెప్టెన్ సభర్వాల్ 15 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అతని తల్లి మరణించి కూడా మూడేళ్లకు పైనే అయింది. ఆ తర్వాత కూడా ఎలాంటి ప్రమాద ఘటనలు చోటుచేసుకోకుండా 100కు పైగా విమానాలు అతను నడిపాడు' అని ఆ లేఖలో పుష్కరాజ్ తెలిపారు. కాగా, ఏఏఐబీ జూలై 12 ప్రాథమిక నివేదక విడుదల చేసింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణంపై ఇప్పుడే ఒక ముగింపునకు రాలేమని ఆ నివేదిక పేర్కొంది. దీంతో పైలట్ తప్పిదం వల్ల కానీ, మానసిక అస్థిరత వల్ల కానీ ప్రమాదం జరిగి ఉండవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి.
ఇవి కూడా చదవండి..
ఉద్ధవ్ ఠాక్రే తల్లి విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఆగంతకులు
ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Read Latest National News and Telugu News