Bhagwant Mann: పని చేయకుండా ప్రధాని కావాలంటే ఎలా.. రాహుల్‌ను ప్రశ్నించిన పంజాబ్ సీఎం
ABN , Publish Date - Dec 13 , 2025 | 08:58 PM
ప్రజాస్వామ్యంలో నిలకడైన పనితీరు, ప్రజావిశ్వాసం ముఖ్యమమని భగవంత్ మాన్ అన్నారు. అధికారం ప్రకటించుకుంటే వచ్చేది కాదని అది సంపాదించుకోవాలని వ్యాఖ్యానించారు.
చండీగఢ్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి, ఆ పార్టీకి కొద్దికాలంగా దూరంగా ఉంటున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూకు మధ్య ఒక పోలిక తెస్తూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు నేతల మధ్య ఒకే విధమైన సమస్య ఉందని, తమ పనితీరు ప్రదర్శించకుండానే ఉన్నత స్థాయి పదవులు ఆశిస్తుంటారని విమర్శించారు.
ఆదివారంనాడిక్కడ మీడియాతో మాన్ మాట్లాడుతూ, జాతీయ స్థాయితో ఒకరికి, రాష్ట్ర స్థాయిలో మరొకరికి ఉన్నత స్థాయి పదవులు చేపట్టాలని కోరికలు ఉన్నాయని చెప్పారు. నన్ను ప్రధానిని చేస్తే ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తానని రాహుల్ అంటుంటారని, అయితే ప్రజలు మాత్రం ముందు మీ పనితీరు చూపిస్తే మిమ్మల్ని ప్రధానిని చేసే విషయాన్ని ఆలోచిస్తామని చెబుతుంటారని అన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పరిస్థితి కూడా అంతేనన్నారు. పంజాబ్ ప్రజలు తనను ముఖ్యమంత్రిని చేయాలని అనుకుంటారని, ముందు పనిచేసి చూపిస్తే ఆ తర్వాత సీఎం చేసే విషయం ఆలోచిస్తామని ప్రజలు అంటుంటారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిలకడైన పనితీరు, ప్రజావిశ్వాసం ముఖ్యమని అన్నారు. అధికారం ప్రకటించుకుంటే వచ్చేది కాదని అది సంపాదించుకోవాలని వ్యాఖ్యానించారు. పంజాబ్ ప్రజలు బడా వాగ్దానాలు, పొలిటికల్ డ్రామాలను నమ్మే పరిస్థితి లేదని, పనిచేసి చూపిస్తేనే ఆదరిస్తారని చెప్పారు.
సిద్ధూను పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తిరిగి పార్టీలో చురుగ్గా పాల్గొంటారని ఆయన సతీమణి నవజోత్ కౌర్ సిద్ధూ ఇటీవల పేర్కొన్నారు. ఇందుకోసం పార్టీలకు డబ్బులు చెల్లించలేమని, అధికారంలోకి వస్తే మాత్రం పంజాబ్‌ను బంగారు రాష్ట్రంగా మారుస్తామని అన్నారు. ఆమె వ్యాఖ్యలపై పంజాబ్ కాంగ్రెస్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి నవజోత్ కౌర్‌ను సస్పెండ్ చేసింది.
ఇవీ చదవండి:
కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్
ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి