Share News

Pankaj Chaudhary: యూపీ బీజేపీ చీఫ్ పదవికి కేంద్ర మంత్రి నామినేషన్

ABN , Publish Date - Dec 13 , 2025 | 07:59 PM

పదవి పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా ఒక కార్యకర్తగా అంకిత భావంతో తాము పనిచేస్తామని పంకజ్ చౌదరి తెలిపారు.

Pankaj Chaudhary: యూపీ బీజేపీ చీఫ్ పదవికి కేంద్ర మంత్రి నామినేషన్
Pankaj Chaudhary

లక్నో: ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ (Uttar Pradesh BJP Chief) పదవికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) శనివారంనాడు నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే లాంఛనంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను సెంట్రల్ ఎలక్షన్ అధికారి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదివారంనాడు ప్రకటించనున్నారు.


చౌదరి తన నామినేషన్ పత్రాన్ని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి నరేంద్ర పాండే, కేంద్ర ఎన్నికల పరిశీలకులు వినోద్ తావ్డే‌కు లక్నో కార్యాలయంలో అందజేశారు. ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, జల్ శక్తి మంత్రి స్వతంత్రదేశ్ సింగ్ తదితరులు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. చౌదరి పేరును యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, స్మృతి ఇరానీ, స్వతంత్ర దేవ్ సింగ్, సూర్య ప్రతాప్ షాహి, సురేశ్ ఖన్నా, బేబీ రాణి మౌర్య ప్రతిపాదించారు.


పార్టీ ఏ బాధ్యత అప్పగించినా..

నామినేషన్ సమర్పించిన అనంతరం చౌదరి మాట్లాడుతూ, నామినేషన్ దాఖలు పూర్తయిందని, స్క్రూటినీ జరుగుతోందని చెప్పారు. ఆదివారంనాడు అధికారికంగా ప్రకటించిన తర్వాత తాను మరింత వివరంగా మాట్లాడగలనని చెప్పారు. పదవి పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా ఒక కార్యకర్తగా అంకిత భావంతో తాము పనిచేస్తామని చెప్పారు.


పార్టీ అధ్యక్షుడి ఎన్నిక పూర్తయింది

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయిందని, ఒకే నామినేషన్ దాఖలైందని మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. నామినేషన్‌ పరిశీలన అనంతరం ఆదివారంనాడు అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పారు. పంజక్ చౌదరి నామినేషన్‌ను తామంతా ఏకగ్రీవంగా ప్రతిపాదించామని తెలిపారు. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో త్వరలో పంచాయతీ ఎన్నికలు, 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక చాలా కీలకమని విశ్లేషకులు చెబుుతున్నారు.


ఎవరీ పంకజ్ చౌదరి

కుర్మీ సామాజిక వర్గానికి చెందిన పంకజ్ చౌదరి ఏడుసార్లు మహారాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఓబీసీ వర్గాల్లో మంచి పలుకుబడి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆయన అత్యంత విశ్వసనీయుడనే పేరుంది. కుర్మీ సామాజిక వర్గానికి చెందిన నేతను రాష్ట్ర అధ్యక్షుడుగా మూడుసార్లు బీజేపీ ఎన్నుకుంది. మాజీ ఎంపీ వినయ్ కతియార్, మాజీ మంత్రి ఓం ప్రకాష్ సింగ్, స్వతంత్ర దేవ్ సింగ్‌ ఈ పదవిలో పనిచేశారు.


ఇవీ చదవండి:

కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్

ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 13 , 2025 | 08:00 PM