Goa Night Club Fire: బతికున్నా నరకయాతన అనుభవిస్తోంది.. బార్ డాన్సర్ క్రిస్టినా భర్త ఆవేదన
ABN , Publish Date - Dec 13 , 2025 | 06:38 PM
గత ఆరు రోజులుగా తన భార్య నిద్రపోవడం లేదని, ఇంటి నుంచి బయటకు రావడం మానేసిందని, మానసిక క్షోభతో బరువు కూడా ఐదు కిలోలు తగ్గిందని బుకిన్ తెలిపారు.
గోవా: గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర సంచలనమైంది. ఈ ఘటనలో 25 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో 'షోలో' చిత్రంలోని 'మెహబూబా మెహబూబా' పాటతో అతిథులను అలరిస్తూ నృత్యం చేసిన కజకిస్థాన్ డాన్సర్ క్రిస్టినా (Kristina) మాత్రం ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. అయితే క్రిస్టినా పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, బతికున్న జీవచ్ఛవంలా ఆమె పరిస్థితి ఉందని క్రిస్టినా భర్త మిఖాయిల్ బుకిన్ (Mikhail Bukin) ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఆరు రోజులుగా తన భార్య నిద్రపోవడం లేదని, ఇంటి నుంచి బయటకు రావడం మానేసిందని, మానసిక క్షోభతో బరువు కూడా ఐదు కిలోలు తగ్గిందని బుకిన్ తెలిపారు. 'క్రిస్టినా ఏడుస్తూనే ఉంది. ఆమె జీవితం నాశనమైంది. 25 మంది ప్రమాదంలో చనిపోయారు. కానీ నా భార్య బతికింది. అయినా జీవచ్ఛవంలా గడుపుతోంది' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ఇది చాలా గడ్డు కాలమని చెప్పారు.
కాగా, గోవా దుర్ఘటనపై విచారణ చురుకుగా జరుగుతోంది. గోవా పోలీసులు ఇంతవరకూ 60 మంది సాక్ష్యాలను రికార్డు చేశారు. డిసెంబర్ 12న క్రిస్టినా స్టేట్‌మెంట్‌ను సైతం రికార్డు చేశారు. ప్రమాదం జరిగిన కొద్ది గంటలకే క్లబ్ యజమానులైన సౌరబ్ లూద్రా, గౌరవ్ లూథ్రాలు థాయ్‌లాండ్ పరారయ్యారు. లూథ్రా సోదరులు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ను ఢిల్లీ రోహిణి కోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే లూథ్రా సోదరులను రెండ్రోజుల క్రితం థాయ్‌లాండ్‌లో అరెస్టు చేశారు. ఇండియాకు తీసుకు వచ్చేందుకు అవసరమైన లీగల్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేయనున్నారు.
ఇవీ చదవండి:
కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్
ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి