DK Shivakumar: సొంత కారు లేకుంటే పిల్లను ఇవ్వరన్న డీకే.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ
ABN , Publish Date - Oct 29 , 2025 | 05:56 PM
టన్నెల్ ప్రాజెక్టు రాజధాని ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని డీకే చెబుతుండగా, ఆ ప్రాజెక్టును రద్దు చేసి ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కొన్ని ప్రతిపాదనలను తేజస్వి సూర్య డిప్యూటీ సీఎం ముందుంచారు. డీకేను స్వయంగా ఆయన కలిశారు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలను తీర్చేందుకు ఉద్దేశించిన టన్నెల్ రోడ్ ప్రాజెక్టును సమర్ధిస్తూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) బుధవారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సొంత కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉంది' అన్నారు. దీనిపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెంటనే స్పందించారు. రోడ్ ప్రాజెక్టు ఒక సామాజిక సమస్య తీర్చడానికి ఉద్దేశించిన అంశమని ఇంతవరకూ తాను ఆలోచించనే లేదని కౌంటర్ ఇచ్చారు.
ఏమిటీ వివాదం?
టన్నెల్ ప్రాజెక్టు రాజధాని ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుందని డీకే చెబుతుండగా, ఆ ప్రాజెక్టును రద్దు చేసి ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కొన్ని ప్రతిపాదనలను తేజస్వి సూర్య డిప్యూటీ సీఎం ముందుంచారు. డీకేను స్వయంగా ఆయన కలిశారు. అయితే ప్రత్యామ్నాయం అడిగితే సొరంగ మార్గమే వద్దని తేజస్వి చెప్పినందున ఆయన సలహాతో ప్రాజెక్టును ఆపేయలేమని డీకే మీడియా ముందు స్పష్టం చేశారు. ప్రజలు కార్లు కొనడం వెనక సామాజిక పరిస్థితి తేజస్వికి అర్ధం కాదన్నారు. 'ప్రజలు కార్లు కొనుక్కోకుండా నేను ఆపగలనా? అది సామాజిక బాధ్యతకు సంబంధించిన అంశం. ప్రజలు తమ సొంత వాహనంలో కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాలనుకుంటారు. వాళ్లను కార్లలో వెళ్లకుండా ఆపగలమా? తేజస్వి అవసరమనుకుంటే తన నియోజకవర్గం ప్రజలను ఇళ్లలోనే కార్లు ఉంచి ప్రజారవాణాను వాడుకోవాలని కోరవచ్చు. ఆయన మాటలు ఎందరు వింటారో చూడాలి. ఇవాళ సొంతకారు లేని అబ్బాయిలకు ఆడపిల్లను ఇవ్వడానికి కూడా వెనుకంజ వేస్తున్న పరిస్థితి ఉంది' అని డీకే అన్నారు.
తేజస్వి స్పందనిదే..
డీకే వ్యాఖ్యలపై అంతే వేగంగా తేజస్వి స్పందించారు. బెంగళూరు ట్రాఫిక్ సమస్య తీర్చడానికి రోడ్ ప్రాజెక్ట్ తీసుకువచ్చారని తాను ఇంతకాలం అనుకున్నానని, కానీ ఇది ఒక సామాజిక సమస్యని తీర్చేందుకు ఉద్దేశించినదని డీకే స్పష్టత ఇచ్చారని అన్నారు. తాను చాలా తెలివితక్కువగా ఆలోచించానంటూ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి.,.
తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...
కొత్త టోపీలు సూచించింది నేనే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి