Share News

Pahalgam Terror Attack: మళ్లీ సర్జికల్ స్ట్రైక్ తప్పదా..

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:47 PM

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాదులకు కౌంటర్ ఇచ్చేందుకు భారత్ త్రివిధ దళాలను సమాయత్తం చేస్తోంది. అందుకోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఆ క్రమంలో ఎటువంటి ఆపరేషన్‌కైనా తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రికి త్రివిధ దళాధిపతులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఓసి,కాశ్మీర్ అంతర్గత ప్రాంతాల్లో సైనిక బలగాలు అప్రమత్తమైనాయి.

Pahalgam Terror Attack: మళ్లీ సర్జికల్ స్ట్రైక్ తప్పదా..
PM Modi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పహల్గాంపై ఉగ్ర మూకల దాడి నేపథ్యంలో భారత్ ప్రతీకార చర్యలు దిగుతుందనే సందేహం పొరుగు దేశమైన పాక్‌లో వ్యక్తమవుతోంది. అందులోభాగంగా పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్ ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అయింది. ఈ దాడిలో 28 మంది మరణించడంతో.. భారతదేశం నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందనే భయాందోళనలు పాకిస్తాన్‌లో నెలకొన్నాయనే వాదన వినిపిస్తోంది. అందులోభాగంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలను వెంటనే ఖాళీ చేయాలని పాక్ ఆదేశించినట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి)చుట్టూ హై అలర్ట్ జారీ చేయడంతోపాటు పాకిస్తాన్ సైనిక, నిఘా సంస్థల సీనియర్ అధికారులు నిరంతర సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం.


గౌతమ్ గంభీర్..

మరోవైపు పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్‌లో ఆగ్రహావేశాలను వ్యక్తమవుతోన్నాయి. ఈ సంఘటనపై టీమిండియా ప్రధాన కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్.. తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. బాధ్యులు దీనికి మూల్యం చెల్లించుకుంటారు. భారతదేశం దాడి చేస్తుందంటూ ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. గౌతమ్ గంభీర్ చేసిన ఈ ప్రకటన భారతదేశ వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఇది పాకిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్ భయాన్ని సృష్టించింది.


ఎల్ జీ మనోజ్ సిన్హా..

జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ.. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడి పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఉగ్రవాద దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అత్యంత దారుణమైన ఈ దాడి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని ప్రజలకు తాను హామీ ఇస్తున్నాని స్పష్టం చేశారు. డీజీపీతోపాటు భద్రతా అధికారులతో ఈ అంశంపై మాట్లాడానన్నారు. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసు బృందాలు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని వివరించారు.

తన మరో ఎక్స్ ఖాతా ద్వారా లెఫ్టినెంట్ జనరల్ఎల్జీ సిన్హా మాట్లాడుతూ.. ఉగ్రవాదులను తటస్థీకరించడానికి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ప్రారంభించామన్నారు. యావత్ దేశమంతా కోపంగా ఉందని చెప్పారు. తమ దళాలు రక్తం కారుస్తున్నాయని చెప్పారు. పహల్గామ్ దాడికి పాల్పడిన వారు.. భారీ మూల్యం చెల్లించుకుంటారని తాను దేశానికి హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు.


ఎల్‌ఓసీ సమీపంలో ఉన్న అన్ని ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను ఖాళీ చేయాలని పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ అధికారులు వెంటనే సూచనలు ఇచ్చారని సమాచారం. గత రాత్రి ఆలస్యంగా.. ఉగ్రవాదులను సమీపంలోని గ్రామాలకు తరలించమని ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది. భారత్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉన్నందున.. అంటే సర్జికల్ స్ట్రైక్ లేదా వైమానిక దాడి వంటి చర్యలు తీసుకుంటారనే భయంతో పాక్ ఈ చర్యలకు పునుకొంది. ఉగ్రవాద దాడులపై ప్రతిస్పందించడంలో భారతదేశం ఆలస్యం చేయదని గత చరిత్ర చూస్తే ఇట్టే అర్థమవుతోందనే అభిప్రాయం పాక్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇస్తుంది!

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత పాకిస్తాన్‌కు భారతదేశం తగిన విధంగా సమాధానమిచ్చింది. ఉదాహరణకు 2016లో ఉరి దాడి.. 2019లో పుల్వామా దాడి తర్వాత, భారతదేశం పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సర్జికల్‌తోపాటు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ చర్యలు ఉగ్రవాద సంస్థలకు భారీ నష్టాన్ని కలిగించడమే కాకుండా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తన కఠిన వైఖరి తీసుకుంటుందనే సందేశాన్ని పాకిస్తాన్‌కు స్పష్టంగా పంపాయి.

ప్రస్తుత పరిస్థితిలో, పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ఎల్‌ఓసీ వెంబడి సైనిక కార్యకలాపాలు పెంచింది. అలాగే నిఘా సంస్థలు పీఓకేలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా ఉంచాయి. సోషల్ మీడియాలో సైతం ప్రజల ఆగ్రహంగా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం భారీగా సర్జికల్ స్ట్రైక్‌ను డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎటువంటి సైనిక చర్యను ప్రకటించనప్పటికీ, భారతదేశం ప్రతీకార వ్యూహంపై పనిచేస్తోందనే అభిప్రాయం పలు వర్గాల్లో వ్యక్తమవుతోంది.


భారతదేశం ఎప్పుడు దాడి చేసిందంటే..?

  • 2016 సెప్టెంబర్ 29 : పాక్ అక్రమిత కాశ్మీర్‌లోని ఉరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్

  • నేపథ్యం : 2016 సెప్టెంబర్ 18న, జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లోని ఉరిలోని భారత ఆర్మీ శిబిరంపై దాడి చేశారు, ఇందులో 19 మంది సైనికులు అమరులయ్యారు.

  • 2016 సెప్టెంబర్ 28-29 రాత్రి, భారత సైన్యానికి చెందిన పారా స్పెషల్ ఫోర్సెస్ పీఓకేలోని నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భింబర్,హాట్‌స్ప్రింగ్,కెల్, లిపా సెక్టార్‌లలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేశారు. దాదాపు 38 నుంచి 50 మంది ఉగ్రవాదులతోపాటు ఇద్దరు పాక్ సైనికులు సైతం మరణించారు.

  • 2019, ఫిబ్రవరి 26: పుల్వామా దాడి అనంతరం వైమానిక దాడి

  • 2 019, ఫిబ్రవరి 14న పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై జైష్-ఎ-మొహమ్మద్ ఆత్మాహుతి దాడి చేసి 40 మంది సైనికులను చంపివేసింది.

  • 2019 ఫిబ్రవరి 26న, భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలు పీఓకేలోని బాలకోట్, చకోతి, ముజఫరాబాద్‌లోని జైష్ ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేశాయి. ఈ ఆపరేషన్‌లో 1000 కిలోల బాంబులను ఉపయోగించారు. దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించారని ప్రకటించారు. జైషే ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్ కూడా ధ్వంసమైంది.

  • ఈ రెండు ప్రధాన ఆపరేషన్లతో పాటు, భారతదేశం ఎప్పటికప్పుడు ఎల్‌ఓసి వెంబడి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను లక్ష్యంగా చేసుకుని పిన్‌పాయింట్ స్ట్రైక్స్ నిర్వహిస్తోంది. ఉదాహరణకు, నవంబర్ 13, 2020న, భారత సైన్యం పీఓకేలోని అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది, అయితే దీనిని అధికారికంగా సర్జికల్ స్ట్రైక్‌గా ప్రకటించలేదు.


పహల్గాం ఉగ్రవాదులకు కౌంటర్ ఇచ్చేందుకు భారత్ త్రివిధ దళాలను సమాయత్తం చేస్తోంది. అందుకోసం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థలను ఏరివేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఆ క్రమంలో ఎటువంటి ఆపరేషన్‌కైనా తాము సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రికి త్రివిధ దళాధిపతులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్‌ఓసి,కాశ్మీర్ అంతర్గత ప్రాంతాల్లో సైనిక బలగాలు అప్రమత్తమైనాయి. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం భారత్‌కు లేక పోలేదని స్పష్టమవుతోంది

ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల చిత్రాలు విడుదల చేసిన నిఘా వర్గాలు

Pahalgam Terror Attack: మృతులకు అమిత్ షా ఘన నివాళి.. హెల్ప్‌ లైన్ నెంబర్లు విడుదల..

Pahalgam Terror Attack: వేడుక కోసం వెళ్లి.. విగత జీవిగా మారిన ఎస్‌బీఐ ఉద్యోగి

Pahalgam Terror Attack: కాల్పులు జరిపిన ఉగ్రవాది ఫొటో విడుదల

Pahalgam Terror Attack: జస్ట్..పెళ్లయిన ఐదు రోజులకే..

Pahalgam Terror Attack: నేడు బంద్.. పహల్గాంలో కాల్పుల వెనుక ఉంది అతడే..

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. వైరల్‌గా మారిన వీడియోలు

For National News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 02:59 PM