Share News

Bula Chowdhury: పద్మశ్రీ బులా చౌదరి గోల్డ్‌మెడల్స్ ఎత్తుకెళ్లిన దొంగలు

ABN , Publish Date - Aug 16 , 2025 | 03:05 PM

హిండర్ మోటార్ రెసిడెన్స్ తాళం వేసి ఉంటుంది. అప్పుడప్పుడు చౌదరి వెళ్లి చూసుకుంటారు. ప్రస్తుతం ఆమె కోల్‌కతాలోని కాస్బా ఏరియాలో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఆమె పూర్వీకుల ఇంటిని అక్కడికి కొద్ది దూరంలో ఉంటున్న ఆమె సోదరుడు మిలన్ చౌదరి అప్పుడప్పుడు వెళ్లి చూసుకుంటూ ఉంటారు.

Bula Chowdhury: పద్మశ్రీ బులా చౌదరి గోల్డ్‌మెడల్స్ ఎత్తుకెళ్లిన దొంగలు
Bula Chowdhury

కోల్‌కతా: పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్విమ్మింగ్ క్వీన్ బులా చౌదరి (Bula Chowdhury) ఇంట్లో దొంగలు పడ్డారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన పలు ప్రతిష్ఠాత్మక పతకాలు, మెమెంటోలు ఎత్తుకెళ్లారు. పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని ఆమె పూర్వీకుల ఇంట్లో ఈ చోరీ జరగడంతో తాను జీవితంలో సంపాదించుకున్న సర్వం కోల్పోయానంటూ బులా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.


'దొంగలు నేను జీవితాంతం కష్టపడి, ఎంతో అంకితభావంతో సాధించిన అన్నింటినీ దోచుకుపోయారు. SAAF గేమ్స్‌లో గెలుచుకున్న ఆరు బంగారు పతకాలతో సహా అన్ని మెడల్స్, పద్మశ్రీ పతకం కూడా ఎత్తుకెళ్లారు' అని చౌదరి తెలిపారు. తనకు వచ్చిన మెమెంటోలు కూడా దోచుకున్నారని, అయితే అర్జున్ అవార్డు, టెన్జింగ్ నార్గే అవార్డులను దొంగలు వదిలేశారని చెప్పారు. బహుశా సైజులో చిన్నవిగా ఉండటంతో అర్జున్ అవార్డును, టెన్జింగ్ నార్గే అవార్డులను దొంగలు గుర్తించినట్టు లేదని అన్నారు. హిండర్ మోటార్ రెసిడెన్స్‌లో చోరీ జరగడం ఇది మూడోసారని ఆమె చెప్పారు.


హిండర్ మోటార్ రెసిడెన్స్ తాళం వేసి ఉంటుంది. అప్పుడప్పుడు చౌదరి వెళ్లి చూసుకుంటారు. ప్రస్తుతం ఆమె కోల్‌కతాలోని కాస్బా ఏరియాలో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఆమె పూర్వీకుల ఇంటిని అక్కడికి కొద్ది దూరంలో ఉంటున్న ఆమె సోదరుడు మిలన్ చౌదరి అప్పుడప్పుడు వెళ్లి చూసుకుంటూ ఉంటారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హాలిడే కావడంతో మిలన్ తన సోదరి సూచనల మేరకు ఆ ఇంటిని శుభ్రం చేయించేందుకు వెళ్లారు. లోపలకు వెళ్లగానే ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. వెనుక గేటు తెరిచి ఉండి, గదిలోని వస్తువులు ఎవరో కొల్లగొట్టారు. విషయం తెలిసిన వెంటనే చౌదరి అక్కడకు వెళ్లారు. గతంలో కూడా తన ఇంట్లో దొంగతనాలు జరిగాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని చౌదరి వాపోయారు.


'దొంగలు నా మెడల్స్ ఎందుకు ఎత్తుకెళ్లారు? ఆ మెడల్స్ వల్ల వాళ్లకు ఏమాత్రం డబ్బులు రావు. అవి నా జీవితంలో సాధించిన విలువైన ఖజానా. నా కెరీర్‌లో సాధించిన విజయాలకు గుర్తులు. ఇల్లు ఖాళీగా ఉండటంతో ప్రతిసారి దొంగలు నా ఇంటిని టార్గెట్ చేస్తున్నారు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

ఫాస్టాగ్ కొత్త వార్షిక పాస్‌కు సూపర్ రెస్పాన్స్.. మొదటి రోజే 1.4 లక్షల మంది కొనుగోలు

ప్రధాని మోదీ అబద్ధాల కోరు.. జైరామ్ రమేశ్ ఫైర్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 03:16 PM