Sabarimala Development: రూ.1000 కోట్లతో శబరిమల అభివృద్ధి.. సీఎం ప్రకటన
ABN , Publish Date - Sep 20 , 2025 | 09:51 PM
పినరయి విజయన్ తన ప్రసంగంలో భగవద్గీత శ్లోకాలను ఉంటకించారు. నిజమైన భక్తులు రాగద్వేషాలకు అతీతమని, సుఖదుఖాలతో సమత్వం కలిగి ఉంటారని అన్నారు. శబరిమల కుల, మతాలకు అతీతమని, అన్ని మతవిశ్వాస వారు ఈ యాత్రను చేపడతుంటారని చెప్పారు.
తిరువనంతపురం: తిరుమల, మదురై వంటి ప్రఖ్యాత తీర్ధ క్షేత్రాల సరసన శబరిమల (Sabarimala) నిలవనుంది. ఇందుకోసం రూ.1000 కోట్లకు పైగా నిధులతో శబరిమల (Sabarimala) అభివృద్ధిని చేపట్టనున్నట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi vijayan) ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షించేందుకు సమగ్ర అభివృద్ధి చర్యలు చేపడతామని, సన్నిధానం ఆధ్యాత్మిక సంపదను కాపాడుతూ శబరిమల, పంబ, నిలక్కల్ ప్రాంతాలతోపాటు సంప్రదాయ యాత్రా మార్గానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని చెప్పారు. అంతర్జాతీయ అయ్యప్ప సమ్మేళనం వేదికగా సీఎం ఈ ప్రకటన చేశారు. ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు 75వ వార్షికోత్సవంలో భాగంగా ఈ సదస్సును నిర్వహించారు.
సీఎం తన ప్రసంగంలో భగవద్గీత శ్లోకాలను ఉంటకించారు. నిజమైన భక్తులు రాగద్వేషాలకు అతీతమని, సుఖదుఖాలతో సమత్వం కలిగి ఉంటాడని అన్నారు. శబరిమల కుల, మతాలకు అతీతమని, అన్ని మతవిశ్వాస వారు ఈ యాత్రను చేపడతుంటారని చెప్పారు. ఇది సెక్యులర్ స్వభావమని చెప్పారు. నాస్తికుడైన దేవరాజన్ మాస్టార్ 'హరివరాసనం' రచన చేస్తే, క్రైస్తవుడైన యేసుదాస్ గానం చేశారని, భక్తులు వావర్ నదా మసీదు మీదుగా సన్నిధానం చేరుకుంటారని, ఈ విశ్వ సమానత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి మెరుగైన సదుపాయాలు అవసరమని అన్నారు.
కొందరు సదస్సు ఏర్పాటు చేసిన సమయాన్ని ప్రశ్నిస్తున్నారని, నమ్మకం కలిగిన భక్తులకే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అప్పగించమని డిమాండ్ చేస్తున్నారని, దేవస్వం బోర్డు నిధులను ప్రభుత్వం దారిమళ్లిస్తోందని ఆరోపణలు చేస్తున్న వారు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం బోర్డులను ఏర్పాటు చేసి ఉండకపోతే అనేక ఆలయాలకు అతీగతీ లేకుండా పోయేదని, వాటిపై ఆధారపడి జీవించే వారు పేదరికంలో మగ్గిపోయేవారని వివరించారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై మాట్లాడుతూ, 2016-17 నుంచి 2025 వరకూ రూ.650 కోట్లు దేవస్వం బోర్డుల ఆధునికీకరణకు వెచ్చించామని చెప్పారు.
మైనారిటీ కాంక్లేవ్‌కు ప్రభుత్వం ప్లాన్ చేసిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కూడా పినరయి విజయన్ తోసిపుచ్చారు. విజన్ 2031 కింద 33 సెమినార్లు నిర్వహిస్తే వాటిలో ఒక దానిని మాత్రమే మైనారిటీ వ్యవహారాల శాఖ నిర్వహించిందని చెప్పారు. శబరిమలను గ్లోబల్ పిలిగ్రిమేజ్ మ్యాప్‌లో నిలపడం, ఎయిర్ ట్రావెల్ ద్వారా వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించడం వంటివి సంవత్సరాల చర్చల ఫలితమని, తదనుగుణంగా ఏర్పాటయిన సదస్సు ఇదని తెలిపారు. సైంటిఫిక్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా శబరి రైల్వే, శబరిమల ఎయిర్‌పోర్ట్, రోప్‌వే వంటి ప్రాజెక్టులు ఉంటాయని చెప్పారు.
మూడు దశల్లో రూ.778.17 కోట్లు
సన్నిధానం అభివృద్ధి 2022 నుంచి 2039 వరకూ మూడు దశల్లో రూ.778.18 కోట్లతో పూర్తవుతుందని సీఎం తెలిపారు. పంబకు రెండు దశల్లో రూ.200 కోట్లకు పైగా కేటాయింపులను ప్లాన్‌లో చేర్చామని వివరించారు. సన్నిధానం, పంబ, యాత్ర మార్గం అభివృద్ధికి రూ.1,033.62 కోట్లు, 2025-30 మధ్య యాత్రికుల సదుపాయాల కోసం రూ.314.96 కోట్ల ప్రాజెక్టులు మాస్టర్ ప్లాన్‌లో చేర్చామన్నారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం లేకుండా యాత్రికుల రవాణా, పార్కింగ్, తాగునీరు, శానిటేషన్, విశ్రాంతి కేంద్రాలు, వైద్య సదుపాయాలు మెరుగపరుస్తామని చెప్పారు. కాగా, 15 దేశాల ప్రతినిధులు, పలు రాష్ట్రాల భక్తులు ఈ సదస్సులో పాల్గొన్నట్టు ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పి.ఎస్.ప్రశాంత్ తెలిపారు. తమిళనాడు నుంచి సుమారు వెయ్యి మంది భక్తులు హాజరైనట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
హెచ్-1బీ వీసాల రుసుము పెంపు భారత్‌కు లాభం, అమెరికాకు నష్టం!
విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..