Share News

H-1B Visa Fee Hike: హెచ్‌-1బీ వీసాల రుసుము పెంపు భారత్‌కు లాభం, అమెరికాకు నష్టం!

ABN , Publish Date - Sep 20 , 2025 | 03:00 PM

H-1B వీసా ఫీజులను ఏడాదికి లక్ష డాలర్ల వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం భారత్, అమెరికాల్లో హాట్ టాపిక్ అయింది. మాజీ నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ ప్రకారం.. ఇది అమెరికా ఇన్నోవేషన్‌ను దెబ్బతీస్తుందని, భారత్‌ను టర్బోచార్జ్ చేస్తుందని..

H-1B Visa Fee Hike: హెచ్‌-1బీ వీసాల రుసుము పెంపు భారత్‌కు లాభం, అమెరికాకు నష్టం!
H1B Visa Fee Hike

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ఫీజులను ఏడాదికి 1,00,000 డాలర్లు (సుమారు రూ.84 లక్షలు) వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం.. భారత్, అమెరికాల్లో హాట్ టాపిక్ అయింది. 'అతి నైపుణ్యం కలిగిన' కార్మికులు మాత్రమే అమెరికాకు వచ్చేలా చేయడం, అమెరికన్ల ఉద్యోగాలను రక్షించడం లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ఫ్ మాట్లాడుతూ.. H1B ప్రోగ్రామ్ 'అత్యంత దుర్వినియోగం అవుతున్న వీసా వ్యవస్థలలో ఒకటి' అని చెప్పుకొచ్చారు.


అయితే, ఈ ప్రకటనపై భారతదేశం నుంచి తీవ్ర ప్రతిస్పందనలు వస్తున్నాయి. ఈ మేరకు మాజీ నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హెచ్ 1బీ వీసాల విషయంలో ట్రంప్ తాజా నిర్ణయం అమెరికా ఇన్నోవేషన్‌ను దెబ్బతీస్తుందన్నారు. అదే సమయంలో భారతదేశ ఇన్నోవేషన్‌ను టర్బోచార్జ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ టాలెంట్‌ను పరిమితం చేయడం వల్ల అమెరికా ఇన్నోవేషన్, ల్యాబ్‌లు, పేటెంట్‌లు, స్టార్టప్‌లు బెంగళూరు, హైదరాబాద్, పూణే, గుర్గావ్ వంటి భారతీయ నగరాలకు మారిపోతాయని కాంత్ అంచనా వేశారు.


అంతేకాదు, ఇది.. అమెరికాకు లాస్, ఇండియాకు గెయిన్ అని అమితాబ్ కాంత్ అన్నారు. భారతదేశంలోని ఉత్తమ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్ట్‌లు, ఇన్నోవేటర్లు వికసిత్‌ భారత్ లక్ష్యానికి దోహదపడటానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు.


అయితే, ఈ అంశంపై విపక్షాలు.. మోదీ సర్కార్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై మండిపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ H-1B వీసాల వార్షిక రుసుము పెంపుపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. దీనిపై ఆయన మోదీ సర్కారుని తీవ్రంగా విమర్శించారు. మన విదేశాంగ విధానాన్ని బలహీనమైనదిగా ఆయన పేర్కొన్నారు. అమెరికా తాజా చర్య.. దేశ ఐటీ, టెక్నాలజీ రంగాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, దానిని ఎదుర్కోవడానికి మోదీ ప్రభుత్వం ఏం సిద్ధం చేసిందో చెప్పాలని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.


అలాగే H-1B వీసాలపై వార్షిక రుసుము 1,00,000 డాలర్లు విధించాలనే అమెరికా నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. దీనిని ఇటీవల ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 'రిటర్న్ గిఫ్ట్' అని అభివర్ణించారు. మీ 'అబ్కీ బార్.. ట్రంప్ సర్కార్' నుంచి వచ్చిన బర్త్‌డే రిటర్న్ గిఫ్ట్‌లు ఇవే అంటూ ఖర్గే 'ఎక్స్'లో ఎద్దేవా చేశారు.

భారతదేశ విదేశాంగ విధానం జాతీయ ప్రయోజనాలను కాపాడటం నుంచి ఎలుగుబంటి కౌగిలింతలు, కచేరీలుగా మారిందని ఖర్గే ఆరోపించారు. 'భారత జాతీయ ప్రయోజనాలు అత్యున్నతమైనవి. బేర్ హగ్స్, భజనలు, ఇంకా ప్రజలను 'మోదీ, మోదీ' అని జపించేలా చేయడం విదేశాంగ విధానం కాదు' అని ఖర్గే అన్నారు. విదేశాంగ విధానం అంటే 'మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం. భారతదేశాన్ని మొదటి స్థానంలో ఉంచడం. జ్ఞానం, సమతుల్యతతో స్నేహాలను నడిపించడం' అని ఖర్గే చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులు రద్దు.. అమెరికా నిర్ణయం

అమెరికా చట్టసభల భవనం ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2025 | 04:15 PM