Share News

Rajnath Singh: సిందూర్‌ పార్ట్‌-2 పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక..

ABN , Publish Date - Sep 22 , 2025 | 10:24 AM

ఉగ్రవాదులకు మద్దతిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్‌నాథ్‌సింగ్ గుర్తు చేశారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ పౌరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం చూసి వారిని మట్టుబెట్టలేదు.

Rajnath Singh: సిందూర్‌ పార్ట్‌-2 పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది.. రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక..
Rajnath Singh

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిందూర్‌ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని తెలిపారు. కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని చెప్పారు. పాక్‌ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. మొరాకో పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. అనంతరం ఆయన ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడారు..


ఉగ్రవాదులకు మద్దతిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్‌నాథ్‌సింగ్ గుర్తు చేశారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ పౌరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మతం చూసి వారిని మట్టుబెట్టలేదు. వారు చేసిన పనులు చూసి చంపేశామని స్పష్టం చేశారు. పహల్గాం ఘటన తర్వాత త్రివిధ దళాల అధిపతులతో సమావేశం జరిగినట్లు చెప్పారు. ఆ సమావేశంలో తను ఒకే ఒక ప్రశ్న అడిగినట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. ఆపరేషన్‌కు మీరు సిద్ధమా..? అని ప్రశ్నించానని చెప్పారు. వారు నిమిషం ఆలస్యం చేయకుండా సిద్ధంగా ఉన్నామని చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.


కేవలం సరిహద్దుల్లోనే కాదు.. భూభాగంలో 100 కిలోమీటర్లు లోపలికి వెళ్లి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినట్లు రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆ దాడుల్లో మసూద్‌ అజార్‌ కుటుంబం చెల్లాచెదురైందని తెలిపారు. ఆ విషయాన్ని తాజాగా.. జైషే ఉగ్ర నాయకులే అంగీకరించినట్లు చెప్పారు. పాకిస్థాన్‌ వేడుకోవడం వల్లే కాల్పుల విరమణకు అంగీకరించామని అన్నారు. స్నేహితులు మారొచ్చు గానీ.. పొరుగువారు ఎప్పటికీ మారరు అని వాజ్‌పేయీ చెబుతుండేవారని గుర్తు చేశారు. అందుకే వారిని సరైన మార్గంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ప్రకటించారు. అది ఎప్పుడైనా మళ్లీ మొదలవ్వొచ్చు అని స్పష్టం చేశారు. సిందూర్‌ పార్ట్‌ 2, పార్ట్‌ 3 అనేది పాక్‌ చర్యలపై ఆధారపడి ఉంటుందన్నారు. పాక్ మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. తగినవిధంగా బుద్ధి చెప్పడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి:

జమ్ము సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ కదలికలు..బీఎస్ఎఫ్ గాలింపు చర్యలు

GST Rate Cut: జీఎస్టీ జోష్‌

Updated Date - Sep 22 , 2025 | 10:29 AM