Share News

Union Budget 2025 update: బడ్జెట్ రోజున నిర్మలమ్మ కట్టిన చీరకున్న విశిష్టత ఏంటో తెలుసా..

ABN , Publish Date - Feb 01 , 2025 | 07:52 PM

వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మ ఈ సారి కూడా ప్రత్యేకమైన చీర ధరించారు. బడ్జెట్ సమర్పించేటప్పుడు నిర్మలమ్మ చెప్పే విషయాలతో పాటు ఆమె కట్టిన చీర కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..

Union Budget 2025 update: బడ్జెట్ రోజున నిర్మలమ్మ కట్టిన చీరకున్న విశిష్టత ఏంటో తెలుసా..
Finance Minister Nirmala Sitharaman saree on Budget Day 2025

ఈ ఏడాది బడ్జెట్‌లో ఏమేం ఉండబోతున్నాయని దేశవ్యాప్తంగా అంతా ఎలా వేచిచూస్తారో.. అదే విధంగా నిర్మలమ్మ ఈ సారి ఎలాంటి చీర ధరించి బడ్జెట్ సమర్పిస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తారు. వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఇది వరకూ మరే ఆర్థిక మంత్రికి లేని రికార్డును ఖాతాలో వేసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరో విషయంలోనూ తన ప్రత్యేకతను కొనసాగిస్తున్నారు. బడ్జెట్ సమర్పించిన ప్రతిసారీ భారతీయ సంప్రదాయ ఔన్నత్యం ప్రతిబింబించేలా సంప్రదాయ చేనేత చీరలు ధరించి అందరినీ కట్టిపడేస్తున్నారు. ఈ సారి కూడా ఒక మధుబని అనే అరుదైన కళను చీర ద్వారా దేశ ప్రజలకు పరిచయం చేశారు. దీంతో ఈ చీరను గిఫ్ట్‌గా ఇచ్చిన దులారీ దేవీ పేరు కూడా ఇప్పుడు మార్మోగిపోతోంది..


అరుదైన చీరతో ఆకర్షించిన నిర్మలమ్మ..

ఎప్పట్లానే ప్రత్యేకమైన చేనేత చీర ధరించి ఫిబ్రవరి 1న 2025-26 సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలమ్మ. బడ్జెట్‌లోని అంశాలతో పాటు వస్త్రధారణ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాంప్రదాయ పసిడి అంచు గల క్రీమ్ కలర్ చేనేత చీర, ఎరుపు రంగు బ్లౌజ్ ధరించి ఆకర్షించారు. చీరపైన ఉన్న మధుబని డిజైన్ అందరినీ కట్టిపడేసింది. 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి బహూకరించిన చీరను ధరించి మధుబని కళ ప్రాశస్త్యం దేశ ప్రజలకు చాటిచెప్పారు. మధుబని కళ అంటే ఏమిటా అని ఫ్యాషన్ ప్రియులు ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు.


మార్మోగుతున్న దులారీ దేవీ.. మధుబని కళల.. పేర్లు..

భారతీయ చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. బీహార్‌లోని మిథిలా నగరానికి చెందిన మరుగునపడిన అరుదైన చేనేత కళల్లో మధుబని కళ ఒకటి. ఈ సాంప్రదాయ జానపద కళలో అందంగా, సున్నిత దారాలు, ఆకర్షణీయమైన రంగులతో చీరపై పూలు, ప్రకృతి, పురాణాలు, రేఖాగణిత డిజైన్లు రూపొందిస్తారు. ఓ సందర్భంలో మధుబని కళలో నైపుణ్యానికి గుర్తుగా 2021లో పద్మశ్రీ అవార్డు అందుకున్న దులారీ దేవిని మిథిలాలో కలుసుకున్నారు నిర్మలమ్మ. అప్పుడామె ఆర్థిక మంత్రికి మధుబని చీరను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆమె కోరిక మేరకు 2025-26 బడ్జెట్ సమర్పించేటప్పుడు అందమైన మధుబని మోటిఫ్ బోర్డర్ చీరను ధరించినట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 01 , 2025 | 07:54 PM