Navjot Kaur Sidhu: నవజ్యోత్ కౌర్ సిద్ధూకు షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్
ABN , Publish Date - Dec 08 , 2025 | 08:35 PM
రూ.500 కోట్ల సూట్‌కేసు ఇచ్చే వాళ్లెవరైనా పంజాబ్ ముఖ్యమంత్రి కావచ్చంటూ నవజ్యోత్ కౌర్ గత శనివారంనాడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకత్వంపైనా అవినీతి ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నవజ్యోత్ కౌర్ సిద్ధూ (Navjot Kaur Sidhu)కు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసింది. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి డాక్టర్ నవజ్యోత్ కౌర్ సిద్ధూను సస్పెండ్ చేస్తూ పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఆదేశాలు జారీ చేశారు.
రూ.500 కోట్ల సూట్‌కేసు ఇచ్చే వాళ్లెవరైనా పంజాబ్ ముఖ్యమంత్రి కావచ్చంటూ నవజ్యోత్ కౌర్ గత శనివారంనాడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకత్వంపైనా అవినీతి ఆరోపణలు చేశారు. పంజాబ్, పంజాబీల గురించి తాము ఎప్పుడూ మాట్లాడతామని, ముఖ్యమంత్రి సీటులో కూర్చునేందుకు మాత్రం రూ.500 కోట్లు ఇచ్చుకోలేమని అన్నారు. తన భర్త, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన మళ్లీ చురుకుగా రాజకీయాల్లోకి వస్తారని, అయితే సీఎం పోస్టుకు ఐదారుగురు పోటీ పడుతున్నందున సిద్ధూను ప్రమోట్ చేస్తారని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
వివరణ ఇచ్చిన కౌర్
కాగా, తన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడంతో నవజ్యోత్ కౌర్ వెంటనే వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, అవిచూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ తమను ఏదీ అడగలేదని చెప్పానని, ఇంకే పార్టీ అయినా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నవజ్యోత్ సింగ్‌ను ప్రకటించే అవకాశం ఉందా అని ప్రశ్నించినప్పుడు సీఎం పదవి కోసం ఇవ్వడానికి తమ వద్ద డబ్బులు లేవని మాత్రమే చెప్పానని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..
అఖండ-2ను వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ఏమన్నారంటే.?
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి