Actor Dileep: నటుడు దిలీప్ నిర్దోషి.. లైంగికదాడి కేసులో కోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:50 PM
ఒక ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న అపహరణకు గురికావడం, కేరళలోని కొచ్చి సమీపంలో కదులుతున్న కారులో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపణలు రావడం మలయాళ పరిశ్రమను కుదిపేసింది. అప్పట్లో ఆ నటి వయస్సు 20 ఏళ్లు.
తిరువనంతపురం: కేరళలో సంచలనం సృష్టించి, మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన లైంగిక దాడి కేసులో ఎర్నాకులం కోర్టు సోమవారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. నటి అహహరణ, కిడ్నాప్ ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ (Dileep)ను నిర్దోషిగా ప్రకటించింది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు నడిచిన ఈ కేసులో దిలీప్‌పై ఉన్న ఆరోపణల నుంచి ఆయనకు కోర్టు విముక్తి కల్పించింది. అయితే ఈ కేసులో ఆరుగురిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. కోర్టు తీర్పుపై దిలీప్ సంతోషం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ కేవలం తన ఇమేజ్‌ను, కెరీర్‌ను దెబ్బ తీసేందుకు జరిగిన కుట్రలో భాగమేనని అన్నారు.

కేరళను కుదిపేసిన కేసు
ఒక ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న అపహరణకు గురికావడం, కేరళలోని కొచ్చి సమీపంలో కదులుతున్న కారులో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపణలు రావడం మలయాళ పరిశ్రమను కుదిపేసింది. అప్పట్లో ఆ నటి వయస్సు 20 ఏళ్లు. ఆమె తన ఫిర్యాదులో త్రిసూరు నుంచి కొచ్చి వస్తుండగా వెనుక నుంచి ఒక కారు తమ కారును ఢీకొందని, దీనిపై వాగ్వాదం జరగడంతో ఇద్దరు వ్యక్తులు తన కారులోకి చొరబడి డ్రైవర్‌ను బెదిరించి, కారును ఆపకుండా నడపాలని ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. రెండు గంటల సేపు తనను బందీని చేసి లైంగిక దాడి జరిపినట్టు ఆరోపించారు. ఆ వ్యక్తులు తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఫోటోలు కూడా తీశారని, ఆ తర్వాత కారు దిగి పారిపోయారని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఈ క్రైమ్ వెనుక దిలీప్ ప్రధాన సూత్రధారి అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017 జూలై 10న దిలీప్‌ను అరెస్టు చేశారు. సుమారు మూడు నెలలు కస్టడీలో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఏడాదికి విచారణ మొదలైంది. కొవిడ్ సహా పలు కారణాలతో కేసు విచారణలో జాప్యం జరిగింది. 261 మంది సాక్ష్యులను విచారించారు. ఎట్టకేలకు సోమవారం నాడు సెషన్స్ జడ్జి హనీ ఎం.వర్గెసే తీర్పునిచ్చారు. కేసులోని 10 మంది నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చారు. దిలీప్‌ను, మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు. దోషులకు పడే శిక్షను వచ్చే శుక్రవారం నాడు కోర్టు ప్రకటించనుంది.
ఇవి కూడా చదవండి..
రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..
అఖండ-2ను వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ఏమన్నారంటే.?
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి