PM Modi wishes Dalai Lama: దలైలామాకు పీఎం మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు..
ABN , Publish Date - Jul 06 , 2025 | 10:02 AM
PM Modi wishes Dalai Lama on his 90th birthday: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సహనానికి మీరు ప్రతీక అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఈరోజుతో 90 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాను 'ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణ'కు చిహ్నంగా మోదీ అభివర్ణించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో చేసిన పోస్ట్‌లో ఆయన దీర్ఘాయుష్షును పొంది ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.140 కోట్ల మంది భారతీయుల తరపున దలైలామాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ప్రజలు కూడా దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
దలైలామా పుట్టినరోజును భారతదేశంలో ఘనంగా జరుపుకుంటున్నారు. ఆదివారం ఉదయం హిమాచల్ ప్రదేశ్ సిమ్లా సమీపంలోని డోర్జిడాక్ ఆశ్రమంలో టిబెటన్ బౌద్ధ సన్యాసులు ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా, దలైలామా ప్రపంచంతో ఒక సందేశాన్ని పంచుకున్నారు. ప్రతి ఒక్కరి పట్ల కరుణ చూపాలని.. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు కృషి చేయాలని నొక్కి చెప్పారు. తన 90వ జయంతి సందర్భంగా సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన నోట్‌లో, మానవ విలువలు, మత సామరస్యం, మనస్సు, భావోద్వేగాల గొప్పతనాన్ని వివరించే ప్రాచీన భారతీయ జ్ఞానసంపద, టిబెటన్ సంస్కృతి ప్రచారానికి నిబద్ధతతో కృషి చేస్తానని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల కరుణ చూపుతూ మనశ్శాంతిని సాధించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. మనశ్శాంతి, కరుణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
దీనికి ఒక రోజు ముందు ధర్మశాలలో ఒక పెద్ద వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు విజయ్ జాలీ, జేడీయూ నేత రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. 1959లో చైనాపై టిబెట్ తిరుగుబాటు విఫలమవడంతో తన 80 వేల మంది అనుచరులతో కలిసి దలైలామా భారతదేశానికి శరణార్థిగా తరలివచ్చారు. ఆనాటి నుంచి ఆయన ధర్మశాలలో నివసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పేషంట్లమంటూ వచ్చి డాక్టర్‌ను కాల్చేశారు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి