Political Alliance: మళ్లీ ఏకమైన ఠాక్రే సోదరులు
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:29 AM
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఠాక్రే సోదరులు సోదరుల కుమారులు ఉద్ధవ్, రాజ్ తొలిసారి ఒకే వేదికను పంచుకున్నారు.

మరాఠీ విజయోత్సవ వేడుకల్లోవేదిక పంచుకున్న ఉద్ధవ్, రాజ్
మహారాష్ట్రపై హిందీని రుద్దితే సహించబోమంటూ కేంద్రంపై తీవ్రస్వరం
‘మహా’ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు
ముంబై, జూలై 5 : మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 20 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఠాక్రే సోదరులు (సోదరుల కుమారులు) ఉద్ధవ్, రాజ్ తొలిసారి ఒకే వేదికను పంచుకున్నారు. మరాఠీ భాష అస్థిత్వం కోసం ఐక్యమవుతామని, ముంబై, మహారాష్ట్రలను చేజిక్కించుకుంటామని ఇరువురు నేతలూ ప్రతినబూనారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేసిన త్రిభాషా సూత్ర విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ సందర్భంగా శనివారం ముంబైలోని వర్లీలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం), మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ‘ఆవాజ్ మరాఠీచా’ పేరిట విజయోత్సవ సభ నిర్వహించాయి.
కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిన సభలో ఈ పార్టీల తరఫున ఉద్ధవ్, రాజ్ వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా తమ కలయికపై వస్తున్న అనుమానాలను తొలగించేందుకు ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నించారు. ‘‘బృహత్ ముంబై కార్పొరేషన్ (బీఎమ్‌సీ) ఎన్నికల వరకైనా మేమిద్దరం కలిసి సాగుతామో లేదోనని అనేకమందికి అనుమానాలు ఉన్నాయి. మేమిక్కడ మరాఠీ కోసం ఉన్నాం. మరాఠీ కోసమే కలిసి ఉంటాం.’’ అని తెలిపారు. మరో అడుగు ముందుకేస్తూ...ముంబై స్థానిక సంస్థల ఎన్నికలను, మహారాష్ట్రను కూడా మేం గెలుచుకుంటామని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. బీఎమ్‌సీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాది మొదట్లో జరగొచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నాయనే సంకేతం అందించాయి. రాజ్ ఠాక్రే కూడా సుమారుగా అదే సూచనను తన ప్రసంగంలో చేశారు. ‘‘మా ఇద్దరిని బాలాసాహెబ్ కలపలేకపోయారు. కానీ, ఆ పని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేయగలిగారు’’ అని రాజ్ అనడంతో సభ నవ్వుల జల్లులతో నిండిపోయింది.
‘కలిసి ఉండాలనుకుంటున్నాం కాబట్టే కలిశాం’’ అని వ్యాఖ్యానించారు. హిందీని రుద్దాలనే ప్రయతాన్ని ఎన్నటికీ సఫలం కానీయబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులపై రాజ్ ఠాకే తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. విచ్ఛిన్న రాజకీయాలు చేస్తూ, రాజకీయాలను వ్యాపారంగా మార్చివేశారంటూ ఆగ్రహించారు.
అదొక ఏడుపుగొట్టు సభ : ఫడణవీస్
ఠాక్రే సోదరులిద్దరు కలిసి.. విజయోత్సవ సభను కాకుండా, ఒక ఏడుపుగొట్టు సభను నిర్వహించారని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ఎద్దేవాచేశారు. బాలాసాహెబ్ కలపలేకపోయిన తామిద్దరిని దేవేంద్ర కలిపారన్న రాజ్ ఠాక్రే వ్యాఖ్యలపై స్పందిస్తూ... తనకు ఆ ఘనతను కట్టబెట్టినందుకు రాజ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రభుత్వాన్ని కూలదోసి తిరిగి పదవిలోకి ఎలా రావాలన్న యావ తప్పించి వారిద్దరి సభలో మరాఠీ గురించి ఒక్క మాట కూడా వినిపించలేదన్నారు.