Yogi Adityanad: ముస్తఫాబాద్ ఇకపై కబీర్‌ధామ్ .. యోగి ప్రకటన
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:36 PM
ఇటీవల తాను వచ్చినప్పుడు ఇక్కడి గ్రామం పేరు ముస్తఫాబాద్ అని తనకు చెప్పారని, ఎంతమంది ముస్లింలు నివసిస్తున్నారని తాను అడిగినప్పుడు ఒక్కరు కూడా లేరని తనకు చెప్పారని యోగి వివరించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో గ్రామం పేరు మారనుంది. లఖింపూర్ ఖేరి జిల్లాలోని ముస్తఫాబాద్ (Mustafabad) గ్రామం పేరును 'కబీర్‌ధామ్' (Kabirdham)గా మార్చనున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తెలిపారు. ఈ మేరకు తమ ప్రభుత్వం ఒక అధికారిక ప్రతిపాదనను కోరుతుందని, అవసరమైన పరిపాలనా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అప్పటి పాలకులు మార్చిన పేర్లను తిరిగి పునరుద్ధరించడం గతంలోనూ తమ ప్రభుత్వం చేసిందని తెలిపారు.
స్మృతి మహోత్సవ్ మేళా 2025లో యోగి అదిత్యనాథ్ సోమవారంనాడు మాట్లాడుతూ, గతంలో పాలకులు ప్రభుత్వ ధనంతో స్మశాన వాటికలకు సరిహద్దు గోడలను నిర్మించే వారని, ఇప్పుడు ప్రభుత్వ ధనాన్ని మత, సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్న స్థలాలను అభివృద్ధి చేసేందుకు వినియోగిస్తున్నామని చెప్పారు. సెక్యులరిజం పేరుతో ఒక ప్రాంతం పేరును మార్చడం హిపోక్రసీ అనీ, సెక్యులరిజం సాకుతో వారసత్వాన్ని తుడిచివేసే శకం ముగిసిందని అన్నారు.
అక్కడ ఒక్క ముస్లిం కూడా లేరు
ఇటీవల తాను వచ్చినప్పుడు ఇక్కడి గ్రామం పేరు ముస్తఫాబాద్ అని చెప్పారని, ఎంతమంది ముస్లింలు నివసిస్తున్నారని తాను అడిగినప్పుడు ఒక్కరు కూడా లేరని తనకు చెప్పారని యోగి వివరించారు. ఇది తనకెంతో ఆశ్చర్యం కలిగించిందన్నారు. ముస్తఫాబాద్ పేరును కబీర్‌ధామ్‌గా మారుస్తామని వారికి చెప్పడం జరిగిందని అన్నారు. సంత్ కబీర్ దాస్‌తో ముస్తఫాబాద్‌కు ఉన్న సాంస్కృతిక సంబంధాన్ని గౌరవిస్తూ పేరు మార్పు జరగనుందని చెప్పారు. గత పాలకులు అయోధ్యను ఫైజాబాద్‌గా, ప్రయాగరాజ్‌ను అలహాబాద్‌గా మార్చారని, తమ ప్రభుత్వం తిరిగి ఆ ప్రాంతాల పేర్లను పునరుద్ధరిస్తోందని అన్నారు. కాశీ, అయోధ్య, కుషినగర్, నైమిశారణ్యం, మధుర-బృందావనం, బర్సానా, గోవర్ధనం వంటి పవిత్ర స్థలాల అభివృద్ధికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
రెండో దశలో 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఎస్ఐఆర్.. ఈసీ కీలక ప్రకటన
తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి