Maha Kumba Mela : మహా కుంభమేళాలో.. ప్రముఖ గాయకుల రాగాల మేళా..
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:35 AM
నేటి నుంచి మహాకుంభ్‌లో రాగాల మేళా మొదలు కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాకారులు త్రివేణి సంగమం వద్ద కళా సాంస్కృతిక మహా కుంభం నిర్వహించనున్నారు. ఈరోజు నుంచి..

నేటి నుంచి మహాకుంభ్‌లో రాగాల మేళా మొదలు కానుంది. త్రివేణి సంగమం వద్ద కళా సాంస్కృతిక మహా కుంభం నిర్వహించనున్నారు. ఈరోజు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 24 వరకు సాంస్కృతిక మహాకుంభం ఉంటుంది. ప్రధాన వేదికగా గంగ పండల్ ఉంటుంది. ఇక్కడ కైలాష్ ఖేర్, సోనూ నిగమ్ వంటి దిగ్గజ గాయకులు సహా దేశంలోని ప్రముఖ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. యమునా పండల్, సరస్వతి పండల్‌లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కళాప్రదర్శనల కోసం నాలుగు చోట్ల 24 వేదికలను ఏర్పాటు చేశారు. గంగా పండల్ వద్ద కాశీకి చెందిన రిత్విక్ సన్యాల్ శాస్త్రీయ గానంతో ఈ కళాత్మక పండుగ గురువారం నుంచి ప్రారంభమవుతుంది. నేటి నుంచి త్రివేణి సంగమంలో నిరంతర సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో ఇది నాలుగో రోజు. ఫిబ్రవరి 26 వరకూ జరగనున్న మహా కుంభ మహోత్సవానికి దేశ విదేశీ భక్తులు పోటెత్తుతున్నారు.144 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన కుంభమేళా కావడంతో త్రివేణీ సంగమానికి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గంగా నదీతీర ప్రాంతమంతా జనసంద్రాన్ని తలపిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యాస్నానాలు ఆచరించినట్లు అంచనా. ఈ అద్భుత మేళాకు మరింత వన్నె తెచ్చేందుకు భారతీయ కళాకారులు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి త్రివేణి సంగమాన్ని తమ కళాత్మకతతో ఓలలాడించేందుకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు.
సెక్టార్-1లోని పరేడ్ గ్రౌండ్‌లో 10,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో గంగా పండల్‌ను నిర్మించారు. రెండు వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో యమునా, సరస్వతీ, త్రివేణిల వద్ద 24 వేదికలు నిర్మించారు. ఆతిథ్య ఉత్తరప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా 5,250 మంది కళాకారులు ఈ రోజు నుంచి ఫిబ్రవరి 24 వరకూ నిరంతర సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు. 5,250 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శించనున్నారు. ఉత్సవం గంగా పండల్ వద్ద కాశీకి చెందిన రిత్విక్ సన్యాల్ శాస్త్రీయ గానంతో ప్రారంభమవుతుంది. బాలీవుడ్ సింగర్ శంకర్ మహదేవన్ కూడా శ్రోతలను ఆనందసాగరంలో తేలియాడించేందుకు గంగా పండల్ ప్రదర్శనలో భాగం కానున్నారు.