Share News

Bihar Mahagathbandhan: కాంగ్రెస్‌కు 50 కంటే ఎక్కువ.. 70 కంటే తక్కువ సీట్లు..

ABN , Publish Date - Oct 12 , 2025 | 08:20 PM

బిహార్‌లోని అన్ని భాగస్వామ్య పార్టీలతో తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జైరామ్ రమేష్ తెలిపారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఆయా నియోజకవర్గాలపై ఖర్గే తుది చర్చలు జరుపుతున్నారని చెప్పారు.

Bihar Mahagathbandhan: కాంగ్రెస్‌కు 50 కంటే ఎక్కువ.. 70 కంటే తక్కువ సీట్లు..

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలకు సంబంధించిన ఫార్ములాను ఎన్డీయే (NDA) ఆదివారం నాడు ఖరారు చేసింది. బీజేపీ, జేడీయూ చెరో 101 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి. దీంతో విపక్ష మహాకుటమి (Mahagathbandhan) పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. విపక్ష కూటమి వర్గాల సమాచారం ప్రకారం, అతి త్వరలోనే సీట్ షేరింగ్ ఫార్ములాను కూటమి ఖరారు చేయనుందని, ఈవారంలోనే అభ్యర్థుల ప్రకటనతోపాటు సంయుక్త మేనిఫెస్టోను కూడా విడుదల చేయనుందని తెలుస్తోంది.


ఢిల్లీలో లాలూ, తేజస్వి

కాగా, సీట్ల పంపకాలకు సంబంధించి ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య మంతనాలు కొనసాగుతున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల అగ్రనేతలు సోమవారం నాడు మరోసారి సమావేశమవుతారని తెలుస్తోంది.


మంతనాలు సాగిస్తున్న ఖర్గే..

బిహార్‌లోని కూటమి భాగస్వామ్య పార్టీలతో తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) తెలిపారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఆయా నియోజకవర్గాలపై ఖర్గే తుది చర్చలు జరుపుతున్నారని చెప్పారు. గత రెండు రోజులుగా ఖర్గే ఇదే పని మీద ఉన్నారని వెల్లడించారు. మహాఘట్‌బంధన్‌ లోని కొత్త భాగస్వాములకు తాము సీట్లు సర్దుబాటు చేయాలని, రాబోయే రెండు రోజుల్లో అన్ని సీట్లలో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుతోపాటు అధికారిక ప్రకటన ఉంటుందని జైరామ్ రమేష్ తెలిపారు.


కాగా, గత బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాలపైనే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, 50 కంటే ఎక్కువ.. 70 కంటే తక్కువ సీట్లను కాంగ్రెస్‌కు కేటాయించే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల సమాచారం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేయగా, 19 సీట్లు గెలుచుకుంది. ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేసి 75 గెలుచుకుంది.


ఇవి కూడా చదవండి..

ఎన్డీయే డీల్ ఓకే.. జేడీయూ-బీజేపీ చెరిసగం..

మంత్రి పదవిని వదులుకుంటా

For More National News And Telugu News

Updated Date - Oct 12 , 2025 | 08:39 PM