Share News

Highway Murder Case: తండ్రిపై ప్రేమతో.. అన్నను చంపేందుకు తెగించిన పోలీస్..

ABN , Publish Date - Aug 06 , 2025 | 03:06 PM

తండ్రిపై ప్రేమతో హంతకుడిగా మారాడు ఓ పోలీసు అధికారి. నాన్న మరణానికి కారణమైన సోదరుడిని హత్య చేయించేందుకు నేరస్థులతో చేయి కలిపాడు. పథకం ప్రకారం, సోదరుడు జైలు నుంచి పెరోల్‌పై బయటకు రాగానే సినిఫక్కీలో మర్డర్ చేయించాడు.

Highway Murder Case: తండ్రిపై ప్రేమతో.. అన్నను చంపేందుకు తెగించిన పోలీస్..
Highway Murder Madhya Pradesh

Madhya Pradesh Revenge Killing: తండ్రిపై ప్రేమ ఆ పోలీసులో ప్రతీకార జ్వాలల్ని రగిల్చింది. నాన్న మరణానికి కారణమైన సోదరుడిని ప్రాణాలతో విడిచిపెట్టకూడదని పంతం పట్టాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా, అతడి పగ పెరుగుతూ పోయిందే తప్ప తగ్గలేదు. ఇక వేచి చూసే ఓపిక అతడిలో నశించిపోయింది. జైల్లో ఉన్న అన్నను బయటకు రప్పించేందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్లో పరిచయాలను వాడుకున్నాడు. తన చేతికి మట్టి అంటకుండా ఉండాలని ముందుగానే నేరస్థులకు కిరాయి ఇచ్చి డీల్ కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం, అన్న జైలు నుంచి పెరోల్‌పై బయటకు రాగానే సినిఫక్కీ తరహాలో మర్డర్ చేశాడు.


కల్పన కంటే వాస్తవం ఇంకా భయంకరంగా ఉంటుందనేందుకు మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలో జరిగిన ఈ హత్యోదంతమే నిదర్శనం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2017లో, రిటైర్డ్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ హనుమాన్ సింగ్ తోమర్‌, అతడి పెద్ద కుమారుడు అజయ్ తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ ఘటనలో సింగ్ మరో కుమారుడు భాను తోమర్ తృటిలో తప్పించుకున్నాడు. ఆ తర్వాత తల్లి, సోదరుడు సాక్ష్యం చెప్పడంతో.. అజయ్ కు కోర్టు జీవితఖైదు శిక్ష విధించింది. మరో పక్క కారుణ్య నియామకం ద్వారా పోలీసు ఉద్యోగంలో చేరిన భాను తోమర్ అజయ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు వేచి చూశాడు.


గత నెలలో, 40 ఏళ్ల అజయ్ పెరోల్ పై జైలు నుంచి బయటకు వచ్చాడు. తొమ్మిది రోజుల తర్వాత, జూలై 23న, అతడు తన 17 ఏళ్ళ కొత్త స్నేహితురాలితో శివపురి నుండి గ్వాలియర్ కు కారులో ప్రయాణిస్తున్నాడు. అయితే, ఆ అమ్మాయి ఒక ద్రోహి అని అప్పుడు అజయ్ కు తెలియదు. కాసేపటి తర్వాత బాత్రూంకు వెళ్లాలంటూ ఆమె హైవేపై కారు ఆపించింది. ఆమె దిగి పక్కకు వెళ్లిపోయిన వెంటనే కొందరు దుండగులు కారును చుట్టుముట్టి అజయ్ పై బుల్లెట్ల వర్షం కురిపించారు.


అజయ్ కు పెరోల్ మంజూరు అయినప్పటి నుంచి హత్యకు నేరస్థులతో కలిసి కుట్ర పన్నాడు ASI భాను తోమర్. ఇండోర్ జువైనల్ హోమ్ నుండి తప్పించుకున్న 17 ఏళ్ల అమ్మాయికి అజయ్ తో స్నేహం చేయమని చెప్పాడు. హత్య చేసేందుకు కుష్వాహా అనే కరుడుగట్టిన నేరస్థుడిని నియమించుకున్నాడు. అజయ్ హత్య కోసం లక్ష రూపాయలకు డీల్ కుదుర్చుకున్నాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం భాను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధర్మేంద్ర అనే వ్యక్తితో సంప్రదింపులు జరిపాడు. సీసీటీవీ ఫుటేజీల పరిశీలనలో భాను చేసిన కుట్రను పోలీసులు గుర్తించారు. కుట్రలో భాగమైన ధర్మేంద్ర, భాను బంధువు మోనేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యువతిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం భాను తోమర్ బ్యాంకాక్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. భానుని పట్టుకునేందుకు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. కుటుంబంలో చెలరేగిన కలహాలే ఈ హత్యలకు దారితీశాయని పోలీసులు నిర్ధారించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 06 , 2025 | 03:11 PM