Karnataka High Court: మలూర్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదు.. కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Sep 16 , 2025 | 06:37 PM
గత అసెంబ్లీ ఎన్నికల్లో నంజేగౌడ గెలుపును బీజేపీ అభ్యర్థి కేఎస్ మంజునాధ్ గౌడ హైకోర్టులో సవాలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఫలితాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు.
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజేగౌడ (KY Nanjegowda)కు హైకోర్టులో చుక్కెదురైంది. మలూర్ (Malur) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నిక చెల్లదని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) మంగళవారంనాడు సంచలన తీర్పునిచ్చింది. తిరిగి ఓట్లు లెక్కించి నాలుగు వారాల్లోగా ఫలితం ప్రకటించాలని భారత ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నంజేగౌడ గెలుపును బీజేపీ అభ్యర్థి కేఎస్ మంజునాధ్ గౌడ హైకోర్టులో సవాలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఫలితాన్ని రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. జస్టిస్ ఆర్.దేవాదాస్ దీనిపై విచారణ జరిపి తాజా తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా వీడియో ఫుటేట్‌ను జాగ్రత్త చేశారా లేదా అనే విషయాన్ని ధ్రువీకరించాలని కోలార్ జిల్లా మాజీ ఎన్నికల అధికారి వెంకటరాజును కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను కోర్టుకు తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొంది.
కాగా, సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నంజేగౌడ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టును అంగీకరించింది. అత్యున్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకునేందుకు వీలుగా 30 రోజుల పాటు ప్రస్తుతం ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.
ఇవి కూడా చదవండి..
మోదీ పుట్టినరోజున బిహార్‌లో చలో జీతే హై చిత్ర ప్రదర్శన
సివిల్ సర్వీస్ అధికారిణి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, నగలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి