Share News

Terror Drill Alert: పారాహుషార్‌

ABN , Publish Date - May 06 , 2025 | 04:56 AM

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, పౌరుల భద్రతను మెరుగుపర్చేందుకు కేంద్రం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించగా, పాకిస్థాన్‌ నిరంకుశంగా ఉన్నట్లు చైనా మరోసారి ప్రకటించింది

Terror Drill Alert: పారాహుషార్‌

పౌరుల భద్రత సన్నద్ధతపై రేపు మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

  • వైమానిక దాడి సైరన్లు మోగగానే సేఫ్‌ జోన్‌కెళ్లడం

  • దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణకు సిద్ధమవడం

  • మాక్‌ డ్రిల్‌లో అవగాహన కల్పించే అంశాలివే..

  • ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా ఉంటాం

  • ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్‌

  • సాయుధ దళాల యుద్ద సన్నద్ధతపై ప్రధానికి వివరాలు తెలిపిన రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌

  • కశ్మీర్‌లోని రెండు హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికతీత పనులు

  • నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల పూర్తికి కసరత్తు

  • పాకిస్థాన్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకుకు భారత్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, మే 5: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. పౌరుల భద్రత సన్నద్ధతపై బుధవారం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. డ్రిల్స్‌లో భాగంగా చేపట్టాల్సిన చర్యలను వివరించింది. వైమానిక దాడులు జరిగినప్పుడు అప్రమత్తం చేసే సైరన్లు మోగగానే ప్రజలు ఏం చేయాలన్నది ఈ డ్రిల్‌లో వివరిస్తారు. శత్రుదేశం దాడి చేసినపుడు తమను తాము ఎలా రక్షించుకోవాలో సామాన్య పౌరులకు, ప్రత్యేకంగా విద్యార్థులకు ఇందులో చెబుతారు. ఆకాశ మార్గాన విదేశీ నిఘాను తప్పించుకోవడానికి హఠాత్తుగా లైట్లు ఆపేసినా, తగ్గించినా.. భయపడకుండా, కంగారు పడకుండా తమ పని తాము చేసుకోవడం నేర్పిస్తారు.


రక్షణపరంగా ముఖ్యమైన పరిశ్రమలను, భవనాలను శత్రు దేశాలు గుర్తుపట్టకుండా మాయోపాయాలు చేయడం ఇందులో భాగమే. దాడి జరిగినపుడు కంగారు లేకుండా జనాన్ని తప్పించడంపై రిహార్సల్స్‌ చేస్తారు. కాగా.. పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తులో రష్యా, చైనా జోక్యం కోరుతున్న పాకిస్థాన్‌కు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ షాక్‌ ఇచ్చారు! ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అన్నివిధాలా అండగా ఉంటామని భారత ప్రధాని మోదీకి ఆయన హామీ ఇచ్చారు. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం మోదీకి ఫోన్‌ చేసి మాట్లాడిన పుతిన్‌.. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారని, ఈ దాడిలో అమాయకుల ప్రాణాలు పోవడం పట్ల ఆవేదన వెలిబుచ్చారని పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక సూత్రధారులను ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టం ముందు నిలబెట్టాలని పుతిన్‌ అభిప్రాయపడినట్టు ఆయన తెలిపారు. మరోవైపు.. వార్షిక ద్వైపాక్షిక భేటీ నిమిత్తం భారత్‌కు రావాలని మోదీ ఆహ్వానించగా, పుతిన్‌ అందుకు అంగీకరించారని క్రెమ్లిన్‌ వర్గాలు తెలిపాయి. అయితే, చైనా మాత్రం తాను ఎప్పటిలా పాక్‌పక్షమేనని మరోసారి నిరూపించుకుంది. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతలను కాపాడేందుకు తాము ఎప్పుడూ పాక్‌కు మద్దతు ఇస్తామని ఇస్లామాబాద్‌లో చైనా రాయబారి జియాంగ్‌ జైడాంగ్‌ తెలిపారు.


సోమవారం ఆయన పాక్‌ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో భేటీ అయ్యారు. మరోవైపు.. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీని సోమవారం కలిసి మాట్లాడారు. సాయుధ దళాల యుద్ధ సన్నద్ధతపై ఆయన ప్రధానికి వివరాలు వెల్లడించినట్లు సమాచారం. కాగా.. జమ్ముకశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందంటూ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరీ ముఖ్యంగా హైప్రొఫైల్‌ ఉగ్రవాదులు, వారికి సహకరించే స్లీపర్‌ సెల్‌ సభ్యులు ఉండే శ్రీనగర్‌ సెంట్రల్‌ జైల్‌, జమ్ములోని కోట్‌ బల్వాల్‌ జైల్‌ వంటివాటిపై దాడులు జరిగే ప్రమాదం ఎక్కువని సమాచారం అందడంతో భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు.. పూంఛ్‌లో భారీ దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతాదళాలు భగ్నం చేశాయి. దాడి కోసం సిద్ధం చేసిన ఐదు ఐఈడీలను, వైర్‌లెస్‌ సెట్లను స్వాధీనం చేసుకున్నాయి.


DSAFS.jpg

రిజర్వాయర్ల పూడికతీత

పహల్గాం దాడి వెనుక పాక్‌ హస్తం ఉన్న నేపథ్యంలో ఆ దేశానికి బుద్ధి చెప్పడానికి సిందు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన భారత్‌.. దాయాది దేశాన్ని ఎండగట్టే చర్యలను వేగవంతం చేసింది. అందులో భాగంగా కశ్మీర్‌లోని రెండు ప్రధాన హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల (సలాల్‌, బాగ్లిహార్‌) నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రిజర్వాయర్‌ ఫ్లషింగ్‌ ప్రక్రియ చేపట్టింది. అంటే జలాశయాల అడుగున పేరుకుపోయిన పూడికను అధిక నీటి ప్రవాహంతో దిగువకు తోసివేయడం. నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఈ ప్రక్రియను కిందటివారమే నిర్వహించింది. దీంతోపాటు.. నత్తనడకన సాగుతున్న/నిలిచిపోయిన ఆరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ సహా పలు శాఖల మంత్రులు, సీనియర్‌ అధికారులతో ఈ వారమే కీలక భేటీ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఈ ఆరు ప్రాజెక్టులూ పూర్తి అయిపోతే జమ్ముకశ్మీర్‌లో 10 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. మరింత సాగు, తాగు నీరు అందుబాటులోకి వస్తుంది. మరోవైపు.. పాకిస్థాన్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలంటూ ఆసియన్‌ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌కు భారత్‌ విజ్ఞప్తి చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ బ్యాంకు 58వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఇటలీకి వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఈ అంశాన్ని ఏడీబీ చీఫ్‌ మసాటో దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 06:00 AM