Share News

Rahul Gandhi: మోదీ బలహీన ప్రధాని.. హెచ్-1బి వీసాలపై రాహుల్ గాంధీ..

ABN , Publish Date - Sep 20 , 2025 | 03:03 PM

ట్రంప్ తొలిసారి దేశాధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని ట్రంప్ దృష్టికి తీసుకురాకపోవడంపై మోదీని తాను 2017లోనే ప్రశ్నించానని రాహుల్ గుర్తుచేశారు. మోదీ ఓ బలహీన ప్రధాని అని రాహుల్ ఎద్దేవా చేశారు.

Rahul Gandhi: మోదీ బలహీన ప్రధాని.. హెచ్-1బి వీసాలపై రాహుల్ గాంధీ..
Rahul Gandhi

న్యూఢిల్లీ: హెచ్ 1బీ వీసాలకు సంబంధించి లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సంతకం చేయడం, ఆ ఉత్తర్వులు ఈనెల 21వ తేదీ నుంచి అమల్లోకి రానుండటంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడి చేసింది. ఈ పరిణామంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తప్పుపట్టారు. ట్రంప్ తొలిసారి దేశాధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని ట్రంప్ దృష్టికి తీసుకురాకపోవడంపై మోదీని తాను 2017లోనే ప్రశ్నించానని రాహుల్ గుర్తుచేశారు. 'మోదీ బలహీన ప్రధాని. మళ్లీ ఇదే మాట చెబుతున్నా' అని రాహుల్ తాజా ట్వీట్‌లో విమర్శించారు.


రాహుల్ అభిప్రాయాన్నే కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యక్తం చేశారు. ట్రంప్ కుట్రలపై రాహుల్ 2017లోనే హెచ్చరించారని, ఇవాళ యావద్దేశం ప్రధాని మోదీని ప్రశ్నిస్తోందని అన్నారు. 'ఇదేమీ కొత్త పరిణామం కాదు. 2017 జూలై 5న ఇలాంటి కుట్ర జరుగుతోందని మోదీని రాహుల్ హెచ్చరించారు. ఏదైనా చేయాలని సూచించారు. కానీ మోదీ బలహీన ప్రధాని. అప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు కూడా అంతే. దీని ఫలితం ఈరోజు చూడబోతున్నాం. లక్షలాది మంది దేశ యువత నష్టపోనున్నారు. ట్రంప్ ప్రతిరోజూ అవమానిస్తూనే ఉన్నారు. కానీ మోదీ సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ట్రంప్ లయర్ అని పార్లమెంటులో చెప్పాలని మోదీకి రాహుల్‌ ఒక అవకాశం ఇచ్చారు. ఆయన ఆ మాట చెప్పి ఉంటే యావద్దేశం ఆయన వెనుకే ఉండేది. ఇవాళ యావద్దేశం మోదీని ప్రశ్నిస్తోంది' అని పవన్ ఖేరా అన్నారు.


ఒక పద్ధతి ప్రకారమే జరుగుతోంది..

భారతదేశంపై ఒక పద్ధతి ప్రకారం అమెరికా పట్టు బిగిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. హెచ్-1బి వీసాపై ఇప్పుడు జరుగుతున్నది యాదృచ్ఛికం కాదని అన్నారు. వరుస పరిణామాలను గమనిస్తే.. పాకిస్థాన్ ప్రేరేపణతోనే యూఎస్ ముందుగానే కాల్పుల విరమణ ప్రకటన చేసిందని అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌కు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారని, ఆ తర్వాత భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారని పేర్కొన్నారు. యూఎస్ ఆశీర్వాదం లేకుండా సౌదీ-పాకిస్థాన్ రక్షణ భాగస్వామ్యం కుదిరే అవకాశం ఎంతమాత్రం లేదని తివారీ అన్నారు. ఒక పద్ధతి ప్రకారం భారత్‌తో అమెరికా కయ్యానికి కాలుదువ్వుతోందని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ

హెచ్‌-1బీ వీసాల రుసుము పెంపు భారత్‌కు లాభం, అమెరికాకు నష్టం!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2025 | 05:13 PM