Share News

Nimisha Priya case: 'నిమిష' ఉరిశిక్షను ఆపలేం.. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం..

ABN , Publish Date - Jul 14 , 2025 | 02:08 PM

యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించామని కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. చిట్టచివరగా మిగిలి ఉన్న ఆశ 'బ్లడ్ మనీ' మాత్రమేనని తెలిపారు. అద్బుతం జరిగితే తప్ప జులై 16న ఆమెను మరణం నుంచి కాపాడలేమని విన్నవించారు.

Nimisha Priya case: 'నిమిష' ఉరిశిక్షను ఆపలేం.. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం..
Nimisha Priya case Supreme Court

ఢిల్లీ: జులై 16న యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషను కాపాడేందుకు భారత ప్రభుత్వం వద్ద ఉన్న అవకాశాలు అతితక్కువని కేంద్రం తరపున భారత అటార్నీ జనరల్ సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. ప్రియ ఉరిశిక్ష ఉత్తర్వును నిలిపివేయడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అయితే, బ్లడ్ మనీ సెటిల్‌మెంట్ మాత్రమే నిమిషను కాపాడగలిగే ఏకైక మార్గం అని ఏజీఐ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు.


నిమిష ప్రియను ఉరిశిక్ష నుంచి దౌత్యపరమైన చర్చల ద్వారా రక్షించేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. ఆమె తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో జులై 10వ తేదీన అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. కేంద్రం తరపున భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తన వాదనలు వినిపించారు. జులై 16న కేరళ నర్సు మరణశిక్షను ఆపేందుకు లేదా వాయిదా వేయించేందుకు భారత ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న అవకాశాలు అతి తక్కువని ఆమె తెలిపారు. భారత్‌-యెమెన్‌ల మధ్య దౌత్యపరంగా సత్సంబంధాలు లేకపోవడమూ ఒక కారణమని అన్నారు. యెమెన్ సున్నితత్వాన్ని దృష్టిపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేయగలిగిందేమి లేదని అన్నారు. ఇక బ్లడ్ మనీ మాత్రమే నిమిషను కాపాడేందుకు ఉన్న చిట్టచివరి అవకాశం అని.. అది కూడా ప్రైవేటు ఒప్పందం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.


AGI, నిమిష తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. కేసు స్థితి గురించి ఇరువర్గాల తదుపరి విచారణలో కోర్టుకు తెలియజేయవచ్చు అని బెంచ్ తన ఉత్తర్వులో పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ లోగా ఆమె ప్రాణాలు కోల్పోతే అది అత్యంత విచారకరమని అన్నారు. అయితే, ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిమిషను ప్రధాని కాపాడాలని కోరుతూ నిన్న విదేశాంగశాఖ మంత్రి జై జైశంకర్‌కు లేఖ రాశారు.


కేరళకు చెందిన నిమిష ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్‌లో ఉద్యోగంలో చేరింది. 2011లో ఆమెకు థామస్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి క్లినిక్ తెరవాలనుకున్నారు. యెమెన్‌లో ఇతర దేశస్థులు సొంతంగా వ్యాపారం చేయడం కుదరదు. అందుకని స్థానికుడైన తలాల్‌ అదిబ్‌ మెహదితో కలిసి అల్‌అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ను మొదలుపెట్టారు. అయితే, 2014లో నిమిష భర్త, కూతురు ఆర్థిక కారణాల కారణంగా ఇండియాకు తిరిగొచ్చేశారు. నిమిష మాత్రం యెమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకుని ఇంటికి తిరిగిరాలేకపోయింది. ఆ తర్వాత నుంచి మెహది ఆమె పాస్ పోర్టు, డబ్బు లాక్కుని చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో 2016లో ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయినా ఫలితం దక్కకపోవడంతో.. 2017లో ఓ రోజున తన పాస్ పోర్టు తీసుకునేందుకు మెహదీకి మత్తుమందు ఇచ్చింది. దురదృష్టవశాత్తూ డోసు ఎక్కువై మెహదీ చనిపోవడంతో అతడి మృతదేహాన్ని వాటర్ ట్యాంకులో పడేసి సౌదీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడింది.


అనూహ్యంగా హత్య కేసులో ఇరుక్కున్న కేరళ నర్సు నిమిషను కాపాడేందుకు బ్లడ్ మనీ మాత్రమే చివరి అవకాశం. అంటే, మృతుడి కుటుంబం నిమిష కుటుంబం ఇవ్వజూపుతున్న రూ.8.6 కోట్ల మొత్తాన్ని పరిహారంగా తీసుకుని క్షమించేందుకు అంగీకరించాలి. యెమెన్ చట్టాల ప్రకారం అలా ఒప్పుకుంటే నిందితుడిని వదిలేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

హీరో ఆర్య సినిమా షూటింగ్‌లో విషాదం.. ఆర్టిస్ట్ మృతి

బెండకాయ కూర తెచ్చిన తంటా .. ఇంట్లోంచి పారిపోయిన యువకుడు..

Read Latest National News And Telugu News

Updated Date - Jul 14 , 2025 | 03:13 PM